నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్భాటాలు, అట్టహాసాలకు దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మ శుక్రవారం విశాఖపట్నంలో ఒక్కటయ్యారు. విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వీరిద్దరూ నేరుగా వన్‌టౌన్‌లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.



