మహిళలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. అవకాశాల్లో సగం, ఆశయాల్లోనూ సగం కావాలి. సమానత్వం ఎవరో ఇచ్చే ‘దానం’ కాదు, అది పుట్టుకతో వచ్చే ‘హక్కు’.
2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి (UN Women) ప్రకటించిన అధికారిక థీమ్ ”ఆడపిల్లలు, మహిళలందరి కోసం హక్కులు, న్యాయం, కార్యాచరణ”.
ఈ థీమ్ వెనుక ఉన్న లక్ష్యం స్పష్టం. చట్టాలు కాగితాల మీద ఉన్నాయి, కానీ అవి మహిళల దరికి చేరుతున్నాయా? న్యాయ వ్యవస్థలు వారిని ఆదుకుంటున్నాయా? లేదు. 1995 నాటి చారిత్రాత్మక ‘బీజింగ్ డిక్లరేషన్’ జరిగి 30 ఏళ్లు దాటిన సందర్భంగా మాటలు సరిపోవని, ‘మహిళల హక్కుల పరిరక్షణలో ఉన్న అడ్డంకులను అధిగమించి కార్యాచరణ’ కావాలని పిలుపు ఇచ్చింది.
భేదభావపూరిత చట్టాలు, బలహీనంగా ఉన్న లీగల్ ప్రొటెక్షన్, సమాజంలోని స్టీరియో టైప్స్, హానికరమైన ఆచారాలు వంటి నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించడం ద్వారా సమాన న్యాయాన్ని సాధించాలని ఈ థీమ్ ఆకాంక్షిస్తున్నది. ఇది 2026 మార్చి 9న జరిగే UN ఆచరణతో కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ వుమెన్‌తో అనుసంధానమై ఉంది.

పోరాటాల నుంచి పుట్టిన మహిళా దినోత్సవం
మార్చి 8 అనేది కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు. అణచివేత పై ధిక్కార స్వరం వినిపించిన రోజు. అది ఒక శతాబ్దపు పోరాటాల ఫలితం. 20వ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల ద్వారా మొదలైంది ఈ ప్రయాణం.
1908లో న్యూయార్క్ నగరంలో సుమారు 15,000 మంది మహిళా కార్మికులు పని గంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కు కోసం వీధుల్లోకి వచ్చారు. ఇది ఆధునిక మహిళా ఉద్యమానికి పునాది వేసింది.
1910లో కోపెన్ హేగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మికుల సదస్సులో, జర్మనీకి చెందిన సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ జరపాలని ప్రతిపాదించారు.
1917లో రష్యాలో మహిళలు ‘ఆహారం, శాంతి’ కోసం సమ్మె చేపట్టారు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం అది ఫిబ్రవరి 23 కాగా, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8. అప్పటి నుండి ఈ తేదీ ప్రపంచ వ్యాప్తమైంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలను గుర్తించడానికి, సమాజంలో వారి పాత్రను గౌరవించడానికి, లింగ సమానత్వం పై అవగాహన కల్పించడానికి ఈ రోజు ఒక వేదికగా మారింది.
1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా దీనిని గుర్తించింది. ప్రతి ఏటా ఒక థీమ్‌తో నిర్వహించడం ప్రారంభించింది. 2026 నాటికి మనం బీజింగ్ డిక్లేషన్ (1995) జరిగి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉన్నాం.
ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన థీమ్ ”ఆడపిల్లలు, మహిళలందరి కోసం హక్కులు, న్యాయం, కార్యాచరణ”. ఇది కేవలం నినాదం కాదు, హక్కుల నుంచి కార్యాచరణకు దిశగా సాగమని చెప్పే హెచ్చరిక.
భారత మహిళ స్థితి:
భారతదేశంలో మహిళల హక్కులు, న్యాయం, కార్యాచరణ స్థితి చూస్తే, కొంత పురోగతి ఉన్నప్పటికీ, లింగ అసమానతలు, హింస, నిర్ణయాధికార లోపాలు ఇంకా చాలా ఎక్కువే. మనదేశంలో ఆస్తి, వివాహం, ఉద్యోగం, ఆర్ధిక స్వాతంత్య్రం వంటి హక్కులు చట్టాల ద్వారా ఉన్నప్పటికీ సామాజిక అంచనాలు, బలహీనమైన అమలు పద్ధతి వల్ల అనేక అడ్డంకులు అందుకు కారణం. ఈ క్రమంలో వివిధ రంగాల్లో నివేదికలు, గణాంకాలు పరిశీలిస్తే ఆశాజనకమైన మార్పులతో పాటు ఆందోళనకరమైన సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
రాజకీయ సాధికారత
2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ 148 దేశాల్లో 131వ స్థానంలో ఉందంటే పరిస్థితి చేసుకోవచ్చు. నలభై ఏళ్ల క్రితమే ఒక మహిళ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన దేశం కావచ్చు, ప్రస్తుతం ఒక మహిళ దేశ ప్రథమ మహిళ కావచ్చు కానీ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యంలో ఎక్కడున్నాం? లోక్ సభలో ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం 13.8% మాత్రమే (గత లోక్ సభలో 14.7). మంత్రుల్లో 5.6% మాత్రమే.
27 ఏళ్లుగా అటకెక్కిన 33% మహిళారిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు 2023లో మహిళల రాజకీయ సాధికారత కోసం నారీ శక్తి వందన్ అధినియం చట్టసభల ఆమోదం పొందింది. అమలు దిశగా అడుగులు వేయాల్సి ఉంది. కార్యాచరణతో దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విప్లవాత్మక మార్పుకు దోహదమవుతుందేమో వేచి చూడాల్సిందే!
అయితే ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పుకోవాలి. స్థానిక సంస్థల్లో 33% మహిళలు ఉన్నప్పటికీ, అధిక శాతం ‘రబ్బర్ స్టాంపులు’గా కనిపించడం శోచనీయం. అలా కాకుండా స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో 33% శాతం రిజర్వేషన్లు కాదు సమాన వాటా 50% అందుకుని స్వతంత్ర నిర్ణేతలుగా ఎదగాలంటే బడ్జెట్ నిర్వహణ, పరిపాలన, ప్రజాసమస్యల పట్ల అవగాహన పెంచే విధంగా శిక్షణ అవసరం. ఆ దిశగా కార్యాచరణ సాగాలి.
విద్య: ఉన్నత విద్యలో మహిళల నమోదు 50%కి చేరడం శుభపరిణామం. ూుజువీ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విభాగాల్లో 42.5% మంది అమ్మాయిలు ఉండటం గర్వకారణమే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపవుట్ రేట్ ఇంకా సవాలే. భేటీ బచావో భేటీ పడావో, విగ్యాన్ జ్యోతి వంటి పథకాలు అద్భుతాలు సష్టిస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడం కాదు, అవి ఆచరణలో ఎక్కడ ఉన్నాయో కాగ్ వంటి సంస్థల నివేదికలు, సామాజిక విశ్లేషకులు బయటపేట్టే చేదు నిజాలు తప్పక గమనించాలి. ప్రచారం వల్ల ఆడపిల్ల భారంకాదు అనే అవగాహన పెరిగి ఉండవచ్చు కానీ విద్యావంతుల శాతం పెరగలేదు. రూపొందించుకున్న పథకాలు మరింత పకడ్బందీగా, నాణ్యంగా అమలుకావాలి.
ఆరోగ్యం: ప్రసూతి మరణాల రేటు 97కి తగ్గి బతికే హక్కు మెరుగుపడినప్పటికీ, 15-49 ఏళ్ల మధ్య మహిళల్లో 57% రక్తహీనతతో బాధపడుతుండటం ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభమే అని చెప్పాలి. బాలికలు, మహిళల పోషకాహార లోపం, గర్భస్రావాలు పెద్ద సవాల్.
పని వత్తిడి వాళ్ళ 30-45 ఏళ్ల మధ్య మహిళల్లో గుండెజబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు 20% పెరిగాయి. అంతేకాదు పర్ఫెక్ట్ ఉమెన్ గా ఉండాలనే సామాజిక ఒత్తిడి వల్ల 30-45 ఏళ్ల మధ్య మహిళల్లో మానసిక ఆందోళనలు 20% పెరగడం ఆందోళన కలిగించే విషయం.
కాగితాల మీద గణాంకాలు బావున్నట్లే కనిపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో నేటికీ తాగునీటి కోసం మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి మహిళల ఆరోగ్యంపై, ముఖ్యంగా వెన్నెముక సమస్యలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ భ్రూణహత్యలు రహస్యంగా జరుగుతూనే ఉన్నాయి. అక్షరాస్యత పెరిగినా వారసుడు కావాలనే కోరిక చావడం లేదు.
పట్టణం ఙర పల్లె ఙర గిరిజన ప్రాంతాలలో సాధికారత గణాంకాలను గమనిస్తే వ్యత్యాసం స్పష్టంగా ఉంది.
రక్తహీనత పట్టణ ప్రాంతాల్లో 52%, గ్రామీణ ప్రాంతాల్లో 59%, గిరిజన ప్రాంతాల్లో 72%., అదే విధంగా ఉన్నత విద్య 40% : 22% : 8% , భూ యాజమాన్యం 18% : 12% : 5% .
గిరిజన ప్రాంతాల్లో శిశు మరణాలు, రక్తహీనత మరియు విద్యా డ్రాపౌట్స్ ఇంకా పెద్ద సవాలుగానే ఉన్నాయి. ‘బేటీ బచావో – బేటీ పఢావో’ వంటి పథకాలు అద్భుతాలు సృష్టిన్నాయని చెప్పుకుంటూ నిధులు ప్రచారానికే కాకుండా, వీరి మౌలిక వసతులకు కార్యాచరణకు మళ్లించాలి.
ఆర్థిక రంగం: ఆర్థిక భాగస్వామ్యం లో గతంలో కన్నా పురోగతి ఉన్నప్పటికీ వేతన వివక్ష ఇప్పటికీ కొనసాగుతున్నది. జెండర్ పే గ్యాప్ చూస్తే పురుషుడికి లభించే ప్రతి 100 రూపాయలకు, మహిళకు కేవలం 77 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి.
కార్పొరేట్ రంగంలో బోర్డు సభ్యులుగా మహిళలు 18% ఉన్నారు కానీ CEO స్థాయిలో 5% కంటే తక్కువ మందే ఉన్నారు.
దేశంలో 70% వ్యవసాయ పనులు మహిళలే చేస్తున్నప్పటికీ, వారి పేరు మీద ఉన్న భూమి కేవలం 14% మాత్రమే. ఇంటి పని, పశువుల పోషణ, పిల్లల పెంపకం… భారతీయ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం సుమారు 35% ఉంది. కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివిన మహిళలు కూడా పెళ్లి, పిల్లల తర్వాత కెరీర్‌ను వదులుకోవాల్సి వస్తోంది. గృహిణి చేసే పనిని ‘ఆర్థిక విలువ’ లేనిదిగా చూడటం వల్ల ఆమె గౌరవం తగ్గుతున్నది. ‘అసంఘటిత సేవలను దేశ జీడీపీలో భాగం చేయనంత కాలం ఆమె ఆశ్రిత గానే మిగిలిపోతున్నది
వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా ప్రభావితం అవుతున్నది మహిళలే (ముఖ్యంగా వ్యవసాయ రంగంలో). ఉపాధి వెతుక్కుంటూ పురుషులు పట్టణాలకు వలస వెళ్తే మహిళలు ఇంటిదగ్గర ఉంది అరకొర వనరులతో కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఉపాధి లేక గిరిజన, పేద మహిళలు పట్టణాలకు వలస వెళ్లి, అక్కడ అసంఘటిత రంగంలో కనీస వేతనం లేకుండా, రక్షణ లేకుండా పని చేస్తున్నారు.

సాంకేతిక రంగం: 2026 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మహిళా ఇంజనీర్ల వాటా పెరిగింది. AI అల్గారిథమ్స్ లో జెండర్ బయాస్ ను తొలగించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మంగళయాన్, చంద్రయాన్ మిషన్లలో కీలక పాత్ర పోషించిన రీతూ కరిధాల్ వంటి మహిళలు అంతరిక్షం పురుషుల గుత్తాధిపత్యం కాదని నిరూపించి ఉండవచ్చు కానీ చేరాల్సిన దూరం చాలా పెద్దదే. టెక్‌లో మహిళలు 32%,STEM గ్రాడ్యుయేట్లలో 43% మహిళలు కానీ వర్క్‌ఫోర్స్‌లో 27% మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నేటికీ ఇంటర్నెట్ మరియు స్మార్ట్‌ఫోన్ లభ్యత తక్కువే.
నికత్ జరీన్ డ పి.వి. సింధు వంటి యువతులు అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తూ, గ్రామీణ అమ్మాయిల్లో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
శివాంగీ సింగ్ భారత వైమానిక దళంలో మొదటి ‘రాఫెల్’ యుద్ధ విమాన పైలట్‌గా రికార్డు సష్టించి, సరిహద్దు రక్షణలో మహిళల సత్తా చాటారు. రోష్నీ నాడార్ (HCL) – ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, వ్యాపార ప్రపంచంలో మహిళా నాయకత్వానికి నిలువుటద్దంగా నిలిచారు. నేటి మహిళ ఎంతో కొంత పురోగతి సాధించినప్పటికీ వెంటాడుతున్న నీడలు, ఆధునిక సవాళ్లు తక్కువేం కాదు. విజయాల వెనుక కొన్ని కఠిన వాస్తవాలు నేటికీ మహిళలను వేధిస్తున్నాయి. అందులో ప్రధానంగా కనిపించేది ఇంటా బయట పని. బయట ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో పని మొత్తం మహిళే చేయాలనే, పిల్లల ఆలనాపాలనా మహిళల బాధ్యతే అనే పాతకాలపు ఆలోచనలు ఆమెను బాధిస్తున్నాయి. మానసిక అలసటకు గురి చేస్తున్నాయి.
ఓ వైపు లింగ ఆధారిత హింస (రేప్, కిడ్నాపింగ్, అసాల్ట్ , గహహింస) పెరిగింది. మరోవైపు పెరిగిన సాంకేతికత వల్ల ఆన్‌లైన్ వేధింపులు మహిళల ఆత్మగౌరవానికి పెద్ద శాపంగా మారాయి. ూఉూన చట్టాలు ఉన్నా, పని ప్రదేశాల్లో ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయం చాలామందిని మౌనంగా ఉంచుతున్నది.
రేపటి వెలుగు కోసం మనమేం చేయాలి? అని ప్రశ్నించుకుంటే 2026 థీమ్ ప్రకారం ‘కార్యాచరణ’ మొదలవ్వాలి.
– న్యాయ వ్యవస్థ: మహిళా కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను బలోపేతం చేయాలి. న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య పెరగాలి. ముఖ్యంగా చట్టాలపై అవగాహన పెంచాలి.
– చట్టపరంగా ఉన్న ఆస్తి హక్కులను సామాజికంగా అమలు చేసేలా చైతన్యం తేవాలి.
– గిరిజన ప్రాంతాల్లో మొబైల్ హాస్పిటల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్య పెరగాలి.
– నీటి వనరులు అందుబాటులోకి తేవాలి. నీటివనరులు దూరం పెరిగేకొద్దీ అది వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా బాలికల బడి సమయం తగ్గుతుంది.
– డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ మహిళలకోసం నిర్వహించాలి. ఫ్రీలాన్సింగ్ అవకాశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అవకాశాలు మహిళకు కల్పిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది.
– డిజిటల్ రక్షణ: సైబర్ నేరాల నుండి రక్షణ పొందేలా మహిళలకు సాంకేతిక శిక్షణ ఇవ్వాలి.
– ఆర్థిక తోడ్పాటు: ఇంటి పని విలువను గుర్తించాలి. మహిళా రైతులకు భూ హక్కులు కల్పించాలి.
– విత్తనాలు, భూమి హక్కులపై అవగాహన ఇవ్వాలి. ప్రకతి వనరుల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి.
– మహిళలను దష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరికరాలు రూపొందించాలి. వాటిపై అవగాహన కలిగించాలి.
– సాంకేతికంగా : యంత్రాల వినియోగం పెరిగినా, అవి పురుషుల శారీరక ఆకతికి అనుగుణంగానే ఉంటున్నాయి. ”మహిళా అనుకూల వ్యవసాయ పనిముట్లు” లేవు.
– సాంస్కతిక, సామాజిక మార్పు: గౌరవం ఇంట్లోనే మొదలవ్వాలి. పిల్లలను ముఖ్యంగా అబ్బాయిలను పెంచే విధానంలో లింగ సమానత్వం ఉండాలి. ఆధునిక సమాజంలో రూపం మార్చుకున్న గహ హింస పెరగింది. లింగ హింస పోవాలి. బాల్యవివాహాలు లేకుండా చూడాలి.
పురుషులు ఏడవకూడదు, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి రాత్రిళ్ళు బయట తిరగకూడదు వంటి పాఠాల రూపకల్పనలో అమ్మ వంట ఇంటిలో పని చేసుకుంటుంటే, నాన్న పేపర్ చదువుకుంటూ ఉండటం కాకుండా ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటున్నట్టు చూపించాలి. అదే విధంగా మీడియాలో మహిళా నాయకుల కథలు చెప్పాలి. స్త్రీ పురుష వివక్ష లేని విధంగా ఉండాలి.
కార్యాచరణలో అది భాగం కావాలి
ఆమె అడుగుజాడల్లో అభివృద్ధి
ఆమె అడుగుజాడల్లోనే అభివద్ధి ఉంది. ఆమెకు అవకాశమివ్వడం అంటే ఒక దేశానికి భవిష్యత్తు ఇవ్వడమే. ఆమె హక్కులు వాగ్దానాలు గానే మిగిలిపోకుండా ప్రతి మహిళా అనుభవించే వాస్తవాలు కావాలంటే, 2026 థీమ్ ‘Rights.Justice. Action’ను మన దేశం స్వంతంగా అమలు చేస్తే — 2030 నాటికి పూర్తి జెండర్ సమానత్వం సాధ్యం కాదా?! మార్పు పైనుంచి వచ్చే చట్టం ద్వారానే కాదు, మన ఆలోచనాసరళిలో రావాల్సిన విప్లవం. అమ్మాయిని బాధ్యతగా కాకుండా బలం గా చూసినప్పుడు, ఆమెకు సాయం కంటే సమానత్వం ఇచ్చినప్పుడు, మహిళను ‘బాధితురాలు’గా కాకుండా ‘హక్కుదారు’గా చూసినప్పుడు మనం ఆశించిన మార్పు రాకుండా ఉంటుందా?!
ప్రతి మహిళకు హక్కు రక్షణ, న్యాయం, కార్యాచరణ అందివ్వడం ద్వారా సమాన, సమద్ధ సమాజాన్ని నిర్మించగలం.
మహిళా సాధికారత మహిళల గమ్యం కాదు. అది నిరంతర ప్రయాణం. అది జాతీయ అభివద్ధికి మూలస్తంభం. మహిళకు సాయం అక్కర్లేదు.. సమానత్వం కావాలి. చట్టాలు రక్షణ కల్పిస్తాయి, కానీ గౌరవం కుటుంబం, సమాజం ఇవ్వాలి అని గుర్తెరగాలి.
స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, అసలు సష్టిలో జీవమే లేదు. ఆమె గెలిచిన రోజున.. సమాజం గెలుస్తుంది, దేశం గెలుస్తుంది. అందుకే కార్యాచరణ నేడే మొదలవ్వాలి. ఆకాశమే హద్దుగా ఆమె ఎగరాలి!
ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన చట్టాలు
సమాన వేతన చట్టం (1976): ఒకే రకమైన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం లభించాలి.
– హిందూ వారసత్వ చట్టం (2005 సవరణ): తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది.
– POSH చట్టం (2013): పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి, ఫిర్యాదులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
– గహ హింస నిరోధక చట్టం (2005): శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పిస్తుంది.
– ప్రసూతి సౌకర్యాల చట్టం (2017): మహిళా ఉద్యోగులకు 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను హామీ ఇస్తుంది.
త్యాగం అనే పేరు – మహిళ
అడిగితే ఆమె చిరునవ్వు,
అడగకపోతే ఆమె త్యాగం.
ఇల్లు నిలబడింది ఆమె మీదే,
కానీ పేరు మాత్రం గోడలకే.
కలలు కన్నది ఆమె,
కలలను నెరవేర్చింది ఇతరుల కోసం.
ఆమె ఆకలి మాటాడదు,
ఆమె అలసట వినిపించదు.
తల్లి అయిన రోజు నుంచి
ఆమె తనను తాను వదిలేసుకుంది.
భార్యగా మారిన క్షణం నుంచి
ఆమె జీవితం పంచుకుంది.
ఆమె కన్నీళ్లు నేలలో కలిసిపోయాయి,
వాటితోనే పూలు పూశాయి.
ఆమె నిశ్శబ్దం గృహాన్ని నిలబెట్టింది,
ఆమె త్యాగమే సమాజాన్ని నడిపింది.
త్యాగం ఆమెకు అలవాటు కాదు-
అది ఆమెకు బలవంతం.
కానీ అదే త్యాగం
ఆమెను దేవతగా చేసింది.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే-
ఇంత త్యాగం చేసిన మహిళకు
ఎంత గౌరవం ఇచ్చాము?
ఎంత న్యాయం చేశాము?
శరత్ సుదర్శి, 7386046936
వి . శాంతి ప్రబోధ
9866703223


