– టీఎస్ యూటీఎఫ్ మండల మహా సభలో డిమాండ్
– అశ్వారావుపేట అధ్యక్షకార్యదర్శులు గా వెంకటేశ్వర్లు,హరినాథ్ బాబు ఎన్నిక
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ డిమాండ్ చేసారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును ఉద్దేశించి మాత్రమే ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఐదు సంవత్సరాలు సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు అందరూ తాము సర్వీస్ లో కొనసాగాలంటే మరియు ప్రమోషన్ పొందాలంటే ఉపాధ్యాయులు తప్పక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలని నిబంధన విధించడం సరి కాదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అశ్వారావుపేట మండల మహాసభ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, మండల అధ్యక్షులు కాపుల హరినాథ్ బాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.ముందుగా టీఎస్ యూటీఎఫ్ పతాకాన్ని సంఘ సీనియర్ నల్లపు కొండలరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ముఖ్యఅతిథిగా హాజరైన మురళీ మాట్లాడుతూ..వెంటనే విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ డీఏ లను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదిక తెప్పించుకొని మెరుగైన పీఆర్సీ ని ప్రకటించాలని, పెన్షనర్ లకు ఇవ్వాల్సిన బకాయిలు గత రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే చెల్లించాలని, పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మండల మహాసభలో సంవత్సర కాలంగా జరిగిన కార్యకలాపాల నివేదికను ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు ప్రవేశ పెట్టగా ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. తదుపరి ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు సమక్షంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎం వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా కే.హరినాథ్ బాబు, ఉపాధ్యక్షులుగా బి. రవికుమార్ ,కె రజని, కోశాధికారిగా జి రాము, కార్యదర్శులు గా ఎ.శివకుమార్,కట్టా మధు,డి. శిరీష,రావుల రాముడు,సరియం జ్యోతి,టీ. బాలు నాయక్ ,కే.విజయలక్ష్మి, ఎం.శ్రీనివాస్ రావు,కే. గంగాధర రావు,మండల ఆడిటర్ గా నల్లపు కొండలరావు ,ఎఫ్.డబ్ల్యు.ఎఫ్ కన్వీనర్ గా జే.వినోద్,మహిళా సబ్ కమిటీ కన్వీనర్ గా ఆర్. బేబి పద్మ ,సాంస్కృతిక కమిటీ కన్వీనర్ గా వలపర్ల బాబురావు ఎన్నికైనారు. దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రసాద్,పున్నం చంద్రశేఖర్ రావు,గోవిందరాజు,ఎం.రామారావు లు పాల్గొన్నారు.



