Thursday, February 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసమసమాజం కోసమే కులాంతర వివాహాలు

సమసమాజం కోసమే కులాంతర వివాహాలు

- Advertisement -

భారతదేశం నిచ్చెనమెట్ల కులవ్యవస్థ. వేల సంవత్సరాల మనుస్మృతి పునాదులపై నిర్మితమైనది చాతుర్వర్ణం. దాని పరిణామ క్రమంలో ఏర్పడిందే కులం. ఇదే అనేక సామాజిక అసమానతలకు మూలం.సాటి మనిషిని మనిషిగా చూడదు. ఏ రెండు కులాలు సమానం కావు. ఒక కులం మరొక కులం కంటే ఎక్కువ, మరొక కులం కంటే తక్కువ. ఈ కుల జాడ్యం తమకులం వాడితో ప్రేమగా, పక్కకులం వాడితో విద్వేషంతో నింపుతుంది. పాలక రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకుకోసం పక్క కులంతో పంచాయితీ పెట్టి అందులో ఒక కులాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోంది. ఘర్షణ లను పెంచుతోంది. ‘కులం పునాదులపై ఒక జాతిని, ఒక నీతిని నర్మించలేమన్న’ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనల ప్రకారం కులం పునాదులైన భూస్వామ్య వ్యవస్థ, హిందు మత అసమానతలపై పోరాడాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ప్రయత్నంలో భాగమే ఈ నెల 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులకు అభినందన కార్యక్రమం.

భారత రాజ్యాంగం కుల నిర్మూలన లక్ష్యంతో ఏర్పడింది. కానీ, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఆ ప్రమాణాలను తుంగలో తొక్కి కులవైశమ్యాలకు కారణమవుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య.కుల నిర్మూలనలో కులాంతర వివాహాలు ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి. కుల నిర్మూలన కోసం జరిగే పరిణామ క్రమంలో మొదటి అడుగు కులాంతర వివాహాలు వేస్తాయి. సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతూ కులాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన కులం దానంతట అదే పోదు. కులాన్ని ప్రయత్న పూర్వకంగా పౌర సమాజం నిర్మూలించాలి. అంటే కులంతో పాటే ప్రయాణిస్తున్న ఆర్థిక అసమానతలను తొలగించాలి. కులాలు వేర్వేరు అయినప్పటికీ ఆర్థిక సమానత్వం కలిగి ఉన్న కులాంతర పెళ్లిళ్లు, ఆరెంజ్డ్‌ పెళ్లిళ్లు పెరిగాయి. ఇందుకు సినిమా ఇండిస్టీలో రామ్‌చరణ్‌-ఉపాసన వివాహం ఒక ఉదాహరణ. అత్యున్నత ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారుల మధ్య కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఆర్థిక సమానత్వం, సామాజిక చైతన్యస్థాయి, అత్యున్నత విద్యావంతుల మధ్య ఇవి ఏ ఆటంకం లేకుండా జరుగుచున్నాయి. సమానత్వం, సామాజిక మార్పుకోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టులు అత్యధికంగా కులాంతర వివాహాలు చేశారు. మరికొన్ని సంఘాల కృషి ద్వారా కూడా అవి కొనసాగుతున్నాయి.

వివాహానికి కావాల్సింది వయసు మాత్రమే. కులం, మతం, ప్రాంతం, భాష, రాష్ట్రం, దేశం వేరైనా ఆ వివాహము చట్టబద్ధమేు. కులం కంటే గుణం గొప్పదై, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలి. అప్పుడే వారి మానసిక ఐక్యత పరస్పర అభిప్రాయాల కలయికతో వివాహం చేసుకోవడానికి చట్టానికి అభ్యంతరం ఉండదు. చాలామందిలో తమకులం వాడైతేచాలు బాల్య వివాహమైన పరవాలేదు బహుగొప్పగా జరుపుదాం అనుకుంటున్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తిన్తున్న వరకట్నాలు, పెద్దలు చూసిన పెళ్లిల్లో కూడా ‘మనకులం వాడేనా కట్నం ఎంత ఇస్తారు? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా?’ ఇవి మాత్రమే చూస్తున్నారు. దీంతో వారిలో గుణగణాలు, ఆప్యాయత అనురాగాలు, పరస్పరం ఒకరిని అర్థం చేసుకునే పరిస్థితులు ఆ పెళ్లి నుండి దూరమవుతున్నాయి. అందుకే వివాహం అంటే ప్రేమ ఆప్యాయత పరస్పరం అర్థం చేసుకునే గుణం ప్రేమ పెళ్లిళ్లలోనే కనిపిస్తాయి. కొన్ని శతాబ్దాల కాలం నుండి కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మహాముని వశిష్టుడు మాదిగ కన్యను వివాహమాడాడు. శ్రీకృష్ణుడు పుట్టినది యాదవ కులం, తను వివాహం చేసుకున్న సుభద్రది వేరే కులం. వెంకటేశ్వరుడు బీబీ నాంచారిలది మతాంతర వివాహం. నాడులేని కులదురహంకారం నేటి ఆధునిక కాలంలో ఒక విషసర్పంగా మారి భావియువతరాన్ని కాటేస్తుంది. కులదురహంకారంతో కన్నకూతుర్నే కడతేర్చిన దుర్మార్గం, మేజర్లు అయి వివాహం చేసుకున్న తర్వాత విడదీయటం, తమ పరువు పోయిందని ఎదుటివారి ప్రాణం తీయడం లాంటి ఘటనలు చూస్తున్నాం. ఆధిపత్య కులాల మధ్య వివాహం జరిగితే ఇవి అంతపెద్దగా కనిపించవు. కానీ, అణగారిన తరగతుల్లో, దళితులు బలహీన వర్గాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మాత్రం దాడులు విపరీతం.

మిర్యాలగూడలో పెరుమాండ్ల ప్రణరు, మంథని మధుకర్‌, అంబోజీ నరేష్‌ వంటి హత్యలు రాష్ట్రాన్ని కుదిపేసాయి. ఈ కాలంలో ఇబ్రహీంపట్నంలో నాగమణి అనే యాదవ యువతిని తన సోదరుడు కారుతో ఢకొీట్టి హత్యచేశాడు. సూర్యాపేటలో గత ఏడాది మాలబంటిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివాసి యువతీ నిండుగర్భిణి. రేపు బిడ్డకు జన్మనిస్తుందని గ్రహించి సొంతమామనే కులదురహంకారంతో గొడ్డలితో నరికిచంపాడు. షాద్‌నగర్‌లో తమ్ముడు కులాంతర పెళ్లికి సహకరించాడని, తన అన్న దళిత యువకుడైన రాజశేఖర్‌ను కిడ్నాప్‌చేసి పెట్రోల్‌ పోసి కిరాతకంగా తగులబెట్టారు. ప్రేమపెళ్లిళ్లు చేసుకున్న వారి హత్యలు, దాడులు, అపహరణల వంటి ఘటనలు రాష్ట్రంలో సుమారు 143. ఇప్పటికీ పన్నెండు వేల మంది తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? వారికి భరోసా నిచ్చి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? ఏదైనా ఘటన జరిగినప్పుడు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు నిందితుల తరఫున ఉంటున్నారు. కేవీపీఎస్‌, మరికొన్ని సంఘాలు బాధితుల తరఫున నిలబడి పోరాడుతున్నాయి. కొంతమంది మేధావులు మీడియాలో పరువు హత్యలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇవి పక్కా కులదురహంకార హత్యలు. ఆర్థిక బలం, అధికారబలంతో పాటు పోలీసు సహకారం వల్లే ఈ హత్యలు జరుగుతున్నట్టు పలు నిజనిర్ధారణ కమిటీల్లో తేలినవి.

అందుకే పౌర సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి. కుల మతాంతర ఆదర్శ వివాహాలను ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రోత్సహించాలి. 18- 21 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రేమ వివాహాలు చేసుకుంటే ప్రోత్సహించాలి. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. వారు జీవించటానికి కావలసిన వనరులు ఏర్పాటు చేయాలి. సాటి మనిషిని మనిషిగా చూడలేని ఈ కులం కుళ్లును కడిగే పాత్ర యువతరం తీసుకోవాలి. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కులాంతర వివాహిత చట్టం రక్షణ అంశాలను చేర్చాలి. కుల,మతాంతర వివాహిత దంపతుల jవారి హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. కులాంతర వివాహాలు నిర్వహించడానికి ఓ ప్రత్యేక కార్పొరేషన్‌, ప్రత్యేకాధికారిని రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి. కులాంతర పెళ్లిలను ప్రోత్సహిస్తూ పది లక్షల రూపాయలు తోడ్పాటునందించాలి. ప్రత్యేకించి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక స్థానం కల్పించినవిధంగా మన రాష్ట్రంలోనూ చేపట్టాలి. వారి పిల్లలందరికీ ఉచిత విద్య,నివాస స్థలం ఇవ్వాలి. ప్రత్యేకించి కులాంతర వివాలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి. ఈ చట్టం ద్వారా నేటి యువతరం ‘కులం లేదు..మతం లేదు..సమతే మా సరిహద్దు” అంటూ కుల,మతాంతర ఆదర్శ వివాహలు చేసుకోవాలి. అలా నవ సమాజం,కుల నిర్మూలన వైపు భారత యువత అడుగులు వేయాలి.

టి.స్కైలాబ్‌ బాబు
9177549646

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -