Tuesday, August 18, 2026
E-PAPER
Homeక్రైమ్అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

- Advertisement -

ఆరుగురు అరెస్ట్‌.. 12 కిలోల హషీష్‌ ఆయిల్‌ పట్టివేత
కాళ్లకు, కడుపునకు 
కట్టుకుని సరఫరా
బెంగళూరుకు తరలిస్తే 
రూ.10 లక్షల డీల్‌.. ఇద్దరు కీలక నిందితుల పరారీ
నవతెలంగాణ – హయత్‌నగర్‌

​హషీష్‌ ఆయిల్‌ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్‌ ముఠా గుట్టును హైదరాబాద్‌ ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. చింతల్‌కుంట వద్ద నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హషీష్‌ ఆయిల్‌, ఐదు సెల్‌ఫోన్లు, రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి సీపీ సుమతి సోమవారం ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన దంపతులు గెమ్మెలి శ్రీను, నిబియా ప్రధాన నిందితులు. వీరు గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు సిక్కుడు శరణ్, పంగి జగదీశ్, మరో ఇద్దరు మైనర్లు వారి ‌నుంచి హషీష్‌ ఆయిల్‌ తీసుకుని బెంగళూరుకు తరలించేవారు. డ్రగ్స్‌ ‌తరలింపులో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిందితులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపుకు మరో కిలో.. మొత్తం మూడు కిలోల హషీష్‌ ఆయిల్‌ను ప్యాకెట్లలో పెట్టి బ్రౌన్‌ టేపుతో శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్నారు. నలుగురు క్యారియర్లు 12 కిలోల హషీష్‌ ఆయిల్‌తో బస్సులో వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. హషీష్‌ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు అక్కడి రిసీవర్‌ రూ.10 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సరుకు బెంగళూరుకు చేరిన అనంతరం ప్రధాన నిందితులకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ హషీష్‌ ఆయిల్‌ అక్రమ రవాణా ప్రారంభించినట్టు వెల్లడించారు. హషీష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్‌ సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. హషీష్‌ ఆయిల్‌లో టీఎచ్‌సీ శాతం సుమారు 40 శాతం ఉండటంతో దీనికి అధిక ధర ఉంటుందని సీపీ సుమతి తెలిపారు. మత్తుపదార్థాల నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని, డ్రగ్స్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపడంతో పాటు సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -