ఓటు హక్కుపై వేటు అధికారమే లక్ష్యంగా మోడీ సర్కారు
సర్ పేరుతో కోట్లాది మంది ఓటర్లపై ప్రభావం
మత రాజకీయాలతో ప్రజల్లో విభజన
కార్పొరేట్లకు పెద్దపీట ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ విలువలకు ముప్పు
న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రోజురోజుకూ బలహీనపడుతోంది. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రజల హక్కులను దెబ్బతీస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మత రాజకీయాలు, కార్పొరేట్ అనుకూల విధానాలు, స్వతంత్ర సంస్థలపై ప్రభుత్వ ప్రభావం దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల భారత్ సమ్మిట్-2026 ముగింపు సమా వేశంలో మాట్లాడుతూ.. 2014 నుంచి దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందనీ, ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్నాయని విమర్శించారు. వివాదాస్పద సర్ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వి-డెమ్ ఇన్‌స్టి ట్యూట్ 2026 ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలో 179 దేశాల్లో భారత్‌కు 106వ స్థానం ఇచ్చింది. 0.38 స్కోరుతో 1975 ఎమర్జెన్సీ తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయిందని పేర్కొంది. భారత్‌ను పూర్తి ప్రజాస్వామ్య దేశంగా కాకుండా ఎన్నికల నిరంకుశ పాలన దిశగా పయనిస్తున్న దేశంగా అభివర్ణించడం గమనార్హం.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలమే పునాది
బ్రిటిష్ పాలన కాలంలో భూస్వామ్య, మత పెద్దల ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకున్న వర్గాల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం రూపుదిద్దు కుందన్న వాదన ఉంది. మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి, కార్మిక సంఘాలు, సామాజిక సంస్కరణలకు వ్యతిరేకంగా ఆ శక్తులు వ్యవహరించాయి.
రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు బదులుగా మనుస్మృతిని ప్రోత్సహించే ధోరణి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉంది. దాని నుంచి పుట్టుకొచ్చిన బీజేపీ.. ఆ సంస్థ భావజాలానికి అనుగుణంగా పని చేస్తూ, హిందూ దేశంగా మార్చే చర్యలను క్రమక్రమంగా అమలు చేస్తోంది.
అసమ్మతికి అడ్డుకట్ట
దేశంలో మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే నిరసనకారులపై కఠిన చర్యలు, ప్రజా స్వామ్య హక్కులపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగించడం ద్వారా భవిష్యత్తు ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం జరుగుతోందన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలులోనూ బీజేపీ చెప్పినట్టుగా అక్రమ వలసదారుల సంఖ్య తేల లేదనీ, అవసరమైన పత్రాలు లేని 20 లక్షల మందిలో 12 లక్షల మంది హిందువులేనని గణాంకాలు చెప్తున్నాయి.
రాజ్యాంగానికి పెను సవాలు
సర్ ప్రక్రియలో ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపా డేందుకు ప్రజలంతా సంఘటితంగా పోరాడాలని మేధావులు పిలుపునిస్తున్నారు. ఇక కీలక పదవుల్లో నియామకాల ద్వారా స్వతంత్ర సంస్థలపై ప్రభావం పెంచుకోవడం, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను కుదించ డం ఆందోళనకరమని అంటున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం అందించిన విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి మోడీ పాలనలో ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
మతం పేరుతో విభజన కార్పొరేట్లకు లాభం
ఫాసిస్టు పాలకులు కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యమిస్తారనీ, బీజేపీ పాలనలో భారత్‌లోనూ పెద్ద సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొం దుతున్నాయని ఆరోపిస్తున్నారు. దేశంలో సాధారణ ప్రజల సమస్యలు తీవ్రమవుతున్నా కార్పొరేట్ల సంపద పెరుగుతోంది. జర్మనీలో జాతి ఆధారంగా ప్రజలను విభజిస్తే, భారత్‌లో మతాన్ని ఆ విభజనకు సాధనంగా వాడుతున్న పరిస్థితులు కనిపి స్తున్నాయి. అయోధ్య రామమందిరం, గోరక్షణ, లవ్ జిహాద్ వంటి అంశాల ద్వారా హిందూత్వ రాజకీయాలను బీజేపీ బలపరుస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
ఫాసిస్టు భావజాల ప్రభావం
హిందూ మహాసభ నేత బి.ఎస్.ముంజే ఇటలీ నియంత ముస్సోలినీని కలుసుకుని, అక్కడి ఫాసిస్టు యువజన సైనిక సంస్థ పనితీరుపై ఆకర్షితుడయ్యాడు. ఆర్‌ఎస్‌ఎస్ రెండో సర్‌సంఘ్‌చాలక్ గోల్వాల్కర్ రచనల్లోనూ జర్మనీలో యూదులపై జరిగిన వివక్షను ప్రశంసించిన భావాలు కనిపిస్తాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ముస్లింలు, ఇతర మతాల వారిని అంతర్గత ముప్పుగా చూపించడం, మనుస్మృతిని గొప్పగా చూడడం హిందూత్వ రాజకీయాల్లో కీలకంగా మారాయని వివరిస్తున్నారు. 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చిన సమయంలో సామాజిక శాస్త్రవేత్త ఆశిష్ నంది ఆయన వ్యక్తిత్వంలో ఫాసిస్టు లక్షణాలు ఉన్నాయని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.






కామెంట్‌లు (0)