ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచుతామని హామీ
నవతెలంగాణ-ములుగు
ఆశా వర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలనే సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని ములుగులో మంత్రి సీతక్కకు ఆశా వర్కర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28వేల మంది ఆశావర్కర్లు 20 ఏండ్లుగా బడుగు, బలహీన వర్గాలకు సేవలందిస్తున్నారన్నారు. గర్భిణీలు ఆస్పత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉన్నారన్నారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కీలకంగా పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మూడేండ్లు గడిచినా నెరవేర్చలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అయినా వేతనంలో ఎలాంటి మార్పులేదని అన్నారు. పనిభారం పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మూడేండ్లుగా దరఖాస్తులు ఇచ్చి శాంతియుత పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో డిసెంబర్ 15 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించినట్టు రత్నం రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశాలు ఆర్. నీలాదేవి, మంజుల, అనిత, సంధ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)