అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు
నవతెలంగాణ -నర్మెట్ట(తరిగొప్పుల)
ఆ తల్లికి ఇద్దరు కూతుళ్లు.. ఒక కుమారుడు.. మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. అయినా చివరి రోజుల్లో ఆమెకు తోడుగా నిలిచేవారు కరువయ్యారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆ తల్లి కన్నుమూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కన్నబిడ్డలు ముందుకు రాని దయనీయ పరిస్థితి. దీంతో గ్రామస్తులే బంధువులై, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన పలువురిని కలచివేసింది. తరిగొప్పులకు చెందిన నాగుబండి పుష్పవ్వ (70) భర్త రాంచంద్రం గతంలోనే చనిపోయారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా, వారిలో ఒక కూతురు మరణించింది. అందరికీ పెండ్లిండ్లు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబంతో సంతోషంగా జీవించిన పుష్పవ్వకు వృద్ధాప్యంలో మాత్రం ఒంటరితనం మిగిలింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది. ఆమె మరణవార్తను కూతురుతో పాటు, కుమారుడికి ఫోన్ ద్వారా తెలియజేసినా స్పందించలేదు. అల్లుళ్లు మాత్రమే చివరిచూపు కోసం వచ్చారు. కానీ, పుష్పవ్వ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు చొరవ తీసుకున్నారు. గ్రామస్తులంతా ఒకటై ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.





కామెంట్లు (0)