ఇస్తే జైలు, జరిమానా
కుటుంబ అక్రమాలు బయటపడతాయనే ఆందోళనతో ట్రంప్ ఉత్తర్వులు..
సమాచార పిటీషన్లు శ్వేతసౌధంతో పంచుకోవాలని ఆదేశం
ప్రయివేటు కంపెనీలు, కాంట్రాక్టర్లకు అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు...
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్ : అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలపై జనవరిలో డెమొక్రాట్లకు పూర్తి నియంత్రణ లభిస్తే తన కుటుంబ అక్రమార్జనలు, అవినీతి బాగోతంపై దర్యాప్తులు తప్పవని నిర్ణయానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి అనేక ఎత్తుగడలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే తాజాగా ఓ కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. సమాచారం కోరుతూ వచ్చే అభ్యర్థనలు, జరిపే సంభాషణల సమాచారాన్ని శ్వేతసౌధంతో పంచుకోవాలని ఫెడరల్ ప్రభుత్వంతో లావాదేవీలు నడుపుతున్న వ్యాపార సంస్థలను ఆయన ఆదేశించారు. దీనిపై డెమొక్రటిక్ దర్యాప్తుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాట స్వభావం కలిగిన స్టీఫెన్ మిల్లర్‌ను కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించడం, రాజకీయ ప్రత్యర్థుల చర్యలకు పదే పదే అడ్డుతగలడంలో దిట్టగా పేరొందిన ఒహాయో ప్రతినిధి జిమ్ జోర్డాన్‌ను హౌస్ రిపబ్లికన్లు తన నాయకుడిగా ఎన్నుకోవడం వంటి పరిణామాలను చూస్తుంటే డెమొక్రాట్లతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడుతున్నారని స్పష్టమవుతోంది.
ఉత్తర్వులో ఏముంది?
'ప్రొటెక్టింగ్ ది ఎగ్యిక్యూటివ్ ప్రివిలేజెస్ అండ్ ఎన్‌హాన్సింగ్ ఎఫీషియన్సీ ఇన్ ఫెడరల్ కాంట్రాక్టింగ్' అనే పేరుతో ట్రంప్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం... ప్రభుత్వంతో ఒప్పం దాలు చేసుకున్న ప్రైవేటు కంపెనీలు, కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్లకు ఏవైనా పత్రాల కోసం లేదా సమాచారం కోసం కాంగ్రెస్ నుంచి నోటీసులు వస్తే వారు వెంటనే వైట్‌హౌస్‌కు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అడిగే సమాచారానికి ఏ విధంగా స్పందించాలనే విషయంపై కంపెనీలు, కాంట్రాక్టర్లు అధ్యక్ష భవనంతో సమన్వయం చేసుకోవాలి. ఒకవేళ ఆ సమాచారం లేదా పత్రాలు కార్యనిర్వాహక ప్రత్యేక హక్కు కిందికి వస్తాయని అధ్యక్షభవనం భావిస్తే వాటిని కాంగ్రెస్‌కు ఇవ్వకూడదు. అధ్యక్షుడు జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉల్లంఘించి అధ్యక్షభవనానికి తెలియకుండా కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చే కంపెనీల కాంట్రాక్టులను రద్దు చేస్తారు. అంతేకాదు...భవిష్యత్తులో వాటికి ఎలాంటి ప్రభుత్వ పనులు ఇవ్వకుండా నిషేధిస్తారు. కార్యనిర్వాహక శాఖ విధులకు ఆటంకం కలిగించేలా లేదా సరైన చట్టబద్ధమైన ఉద్దేశం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి సమాచారం కోరే అధికారం కాంగ్రెస్‌కు లేదు.
విచారణల పేరుతో వేధిస్తోంది : శ్వేతసౌధం
విచారణల పేరుతో ప్రైవేటు కంపెనీలను కాంగ్రెస్ వేధిస్తోందని, అధ్యక్షుడి ప్రత్యేక అధికారాల్లో జోక్యం చేసుకుంటోందని శ్వేతసౌధం ఆరోపించింది. సున్నితమైన ప్రభుత్వ సమాచా రాన్ని, జాతీయ భద్రతా వివరాలను కాపాడడానికే దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని సమర్ధించింది.
ఆ ఉత్తర్వుకు విలువే లేదు : డెమొక్రాట్లు
ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై డెమొక్రటిక్ పార్టీ నేతలు మండిపడ్డారు. జ్యుడీషియరీ కమిటీకి తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న డెమొక్రటిక్ నేత జామీ రాస్కిన్ సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ వార్తా సంస్థలతో మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అసాధారణమైనది, చట్టవిరుద్ధమైనది అని వ్యాఖ్యానించారు. సమాఖ్య చట్టం ప్రకారం దానికి ఎలాంటి విలువ లేదని కొట్టిపారేశారు. ఇది కేవలం ఓ అంతర్గత మెమో వంటిదని చెప్పారు.
హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి నేతృత్వం వహించబోతున్న రాబర్ట్ గార్సియా మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించేందుకు కాంగ్రెస్‌కు రాజ్యాంగ పరమైన హక్కు ఉన్నదని, ప్రభుత్వ ఉత్తర్వు ఆ హక్కుపై ప్రత్యక్షంగా దాడి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలు, అవినీతిని అరికట్టడానికి కాంగ్రెస్ కోరినప్పుడు నిజాయితీగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ కాంట్రాక్టర్లపై ఉన్నదని స్పష్టం చేశారు.
ట్రంప్ తన రెండో పదవీకాలంలో కుటుంబసభ్యుల కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారని, ఆ ఆర్థిక లావాదేవీలు, అవినీతి బయటపడకుండా దాచిపెట్టడానికే ఇలాంటి ఆంక్షలు విధిస్తు న్నారని గార్సియా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతసౌధం అధికారులు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ జనవరిలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ప్రభుత్వం పైన, ప్రభుత్వ కాంట్రాక్టుల పైన సమగ్ర దర్యాప్తులను కొనసాగిస్తామని డెమొక్రాట్లు స్పష్టం చేశారు.
దర్యాప్తులు వీటి పైనే
జనవరి 3వ తేదీన కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించిన తర్వాత ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, విదేశీ ఒప్పందాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి ఆరోపణలు, ఎప్‌స్టీన్ ఫైల్స్, వలస విధానాలు-హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం యొక్క అధికార దుర్వినియోగం, ఏఐ చిప్ నిబంధనలు-కార్పొరేట్ ప్రభావం వంటి విషయాలపై దర్యాప్తులు జరిపేందుకు డెమొక్రాట్లు సిద్ధపడుతున్నారు.
అడకత్తెరలో పోకచెక్కలు అవుతాయి : న్యాయ నిపుణులు
ట్రంప్ తాజా ఉత్తర్వు కారణంగా ప్రైవేటు కాంట్రాక్టర్లు, కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వంలోని రెండు శక్తివంతమైన విభాగాల (అధ్యక్షుడు, కాంగ్రెస్) మధ్య అడకత్తెరలో పోకచెక్కల మాదిరిగా నలిగిపోయే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నోటీసులను పట్టించుకోకపోతే అది ధిక్కరణ కిందికి వస్తుంది. జైలు శిక్ష లేదా జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ శ్వేతసౌధానికి తెలియకుండా సమాచారం ఇస్తే ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దయ్యే అవకాశం ఉంది. కార్యనిర్వాహక ప్రత్యేక హక్కు అనేది అధ్యక్షుడికి, ఆయన అంతర్గత సలహాదారులకు మధ్య జరిగే రహస్య సంభాషణలకు మాత్రమే వర్తిస్తుందన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. బయటి ప్రైవేటు కంపెనీలు, కాంట్రాక్టర్ల వ్యాపార రికార్డులకు ఈ హక్కును వర్తింపజేయడం చట్టపరంగా నిలవదని వారు తెలిపారు. ట్రంప్ ఉత్తర్వు కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ధిక్కరణ కేసుల నుంచి ఎలాంటి చట్టపరమైన రక్షణ కల్పించలేదు. కాంగ్రెస్ విచారణలకు హాజరు కాకుండా ఆ ఉత్తర్వు వారిని ఆపలేదు కూడా. ఉత్తర్వు అమలుపై అధ్యక్షభవనం, కాంగ్రెస్ మధ్య న్యాయపోరాటం తలెత్తే అవకాశం ఉంది. ఈ వ్యవహారం
చివరికి అమెరికా సుప్రీంకోర్టుకు కూడా చేరవచ్చు.






కామెంట్‌లు (0)