ఇజ్రాయిల్ దాడులతో గాజాలో కలుషితమైన
గాలి, నీరు, నేల టన్నుల కొద్దీ పేరుకుపోయిన
భవన శిథిలాలు విజృంభిస్తున్న వ్యాధులు
జెరుసలేం : ఇజ్రాయిల్ సేనలు జరుపుతున్న దాడుల కారణంగా గాజాలో పర్యావరణ కాలుష్యం తీవ్రమైంది. అక్కడ ఎక్కడ చూసిన విషపూరిత కాలుష్య జాడలే కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్, బ్రిటన్‌కు చెందిన కాన్‌ఫ్లిక్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అబ్జర్వే టరీ (సీఈఓబీయస్) సోమవారం సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ప్రకారం ఇజ్రాయిల్ సేనలు ఉపయోగించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు, అవి జరిపిన వైమానిక దాడుల కారణంగా గాజాలో గాలి, నీరు, నేల కలుషితమయ్యాయి. కొన్ని దశాబ్దాల పాటు అవి అక్కడి ప్రజలకు ప్రమాదకరంగా పరిణ మిస్తాయి. ఇజ్రాయిల్ బాంబు దాడుల స్థాయి, వాటి తీవ్రత గాజాలోని సుమారు 78 శాతం భూభాగాన్ని ప్రభా వితం చేశాయి. ఆ ప్రాంతంలోని 99 శాతానికి పైగా భూభాగం విషపూరిత కాలు ష్యానికి గురి కాబోతోందని అధ్యయనంలో తేలింది.
దిగజారిన పర్యావరణ పరిస్థితులు
పేలుడు పదార్థాల అవశేషాలు, భారీ లోహాలు, ధ్వంసమైన భవనాల నుంచి వెలువడిన ఆస్బెస్టాస్, డయాక్సిన్లు, జీవ సంబంధ వ్యర్థాలు గాజాలో గాలి, నీరు, నేలను తీవ్రంగా కలుషతం చేశాయి. 'గాజా విధ్వంసం, కాలుష్యం మానవ భద్రత, మనుగడకు అవసరమైన పర్యావరణ స్థితిగతులను దిగజార్చి ఉంటాయి' అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ చెప్పారు. గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, జబాలియా, సలా అల్-దిన్ రోడ్డు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్నదని అధ్యయనం గుర్తించింది. గాజా అంతటా దాదాపు 6.1 కోట్ల టన్నుల భవన శిథిలాలు పేరుకుపోయాయి. వీటిలో పేలని బ్యాటరీలు, ఇంథన వ్యర్థాలు కలిసి ఉండడంతో భూగర్భ జలాలు విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది.
దెబ్బతిన్న పారిశుధ్యం
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజాలో పారిశుధ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రతి రోజూ సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల శుద్ధి చేయని మురుగు నీరు నేరుగా మధ్యధరా సముద్రంలో కలుస్తోంది. కలుషిత నీరు, గాలి కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే 81,000 మందికి పైగా తీవ్రమైన డయేరియా బారిన పడ్డారు. 19 లక్షలకు పైగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. పాతిక సంవత్సరాల తర్వాత గాజాలో తొలిసారిగా పోలియో కేసు కూడా కన్పించింది. గాజా ఓ విషపూరిత బంజరు భూమిగా మారిపోయిందని, తక్షణమే శుద్ధికి చర్యలు చేపట్టకపోతే అనేక దశాబ్దాల పాటు ప్రజలు...ముఖ్యంగా చిన్నారుల మనుగడకు ముప్పు తప్పదని నివేదిక హెచ్చరించింది.






కామెంట్‌లు (0)