Magazines

మళ్లీ ఒక్కటైన బీజేపీ, ఎస్‌ఏడీ

5 గంటల క్రితం

united
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

అధికార దాహంతో బీజేపీ ఏ పార్టీతోనైనా చెలిమి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఏడీ) మధ్య మళ్ళీ సయోధ్య కుదిరింది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తూ ఎస్‌ఏడీ 2020లో బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. తాజాగా మళ్ళీ ఇరు పార్టీలు కలిశాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా న్యూఢిల్లీలో ప్రకటించారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఎస్‌ఏడీ సీనియర్‌ ‌భాగస్వామిగా వుంటుందని, ఇరు పార్టీలు కలిసి 117 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తాయని తెలిపారు. ఒకవేళ ఈ సంకీర్ణం విజయం సాధించినట్లైతే ముఖ్యమంత్రి పదవి ఎస్‌ఏడీకే లభిస్తుందని కూడా హోం మంత్రి సూచనప్రాయంగా తెలిపారు. 1997, 2007, 2012ల్లో ఈ రెండు పార్టీలు కలిసి పంజాబ్‌‌ను పాలించాయి. ఇటీవలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో తమ రాజకీయ పునాదులను పునరుద్ధరించుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.బీజేపీతో పార్టీ పొత్తు ఒక భావోద్వేగ బంధం శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు.

కూటమిపై కేజ్రీవాల్ విమర్శలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్, బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో బీజేపీ ఏ పార్టీతోనైనా చేతులు కలపగలదని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, రైతులతోనే ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనను పంజాబ్ ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ సమయంలో 700 మందికిపైగా రైతులు మరణించారని ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్