హక్కుల కోసం ఢిల్లీలో భారీ ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పెన్షన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, పెన్షనర్ల హక్కులను హరించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు సుదీప్ దత్తా విమర్శించారు. పెన్షన్ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ ఈస్టర్న్ కోర్టులో ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌సీపీఏ), నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్‌సీసీపీఏ) సంయుక్తంగా నిర్వహించిన ధర్నాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పెన్షనర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పెన్షనర్లను విభజించి వేర్వేరు వర్గాలుగా చూడాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని సుదీప్ దత్తా విమర్శించారు. పెన్షనర్లను వర్గీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని ‘వాలిడేషన్ యాక్ట్-2025’ దీనిని స్పష్టం చేస్తోందని తెలిపారు.
మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మికులు, పెన్షనర్లు ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ధర్నాలో పలు డిమాండ్లను ముందుకు తెచ్చారు. వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ యాక్ట్-2025ను రద్దు చేయాలనీ, 2026కు ముందు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సవరణను కూడా చేర్చేలా ఎనిమిదో వేతన సంఘం విధివిధానాలను సవరించాలని కోరారు. పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ ఉద్యోగుల పెన్షన్లను 2017 జనవరి 1 నుంచి వర్తించేలా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ధర్నాలో ఏకగ్రీవంగా ఆమోదించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీపీఏ అధ్యక్షుడు శివగోపాల్ మిశ్రా, ఎఫ్‌సీపీఏ కన్వీనర్, ఎన్‌సీసీపీఏ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కె.జి. జయరాజ్ తదితరులు ప్రసంగించారు.






కామెంట్‌లు (0)