నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. డిసెంబరు 23న వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గతంలో పురపాలకశాఖ కార్యదర్శిగా పనిచేసిన అధికారి పదవీ విరమణ చేసినా ఉత్తర్వులు అమలు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
మూడు వారాల్లో గ్రాట్యూటీ చెల్లించాలి
ఆత్మహత్య చేసుకున్న న్యాయాధికారి భార్యకు మూడు వారాల్లో గ్రాట్యూటీ చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భర్త మరణానంతర ప్రయోజనాలు అందకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన భార్య దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పెన్షన్ లెక్కింపులో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం వాదించింది. పెన్షన్ వివాదంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించింది. ఇతర అన్ని ప్రయోజనాలను కూడా నిబంధనల ప్రకారం త్వరగా చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేసింది.
గిరిజనేతరుల భూవివాదాల్లో ఆర్డీవోకు అధికారం లేదు
షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనేతరుల మధ్య తలెత్తే భూవివాదాలను పరిష్కరించే అధికారం ఏజెన్సీ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కు లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది. అలాంటి వివాదాలను సివిల్ కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలని పేర్కొంది. నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన భూమి వివాదంలో ఆర్డీవో జారీ చేసిన ఇంజంక్షన్, పోలీసు రక్షణ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వివాదంపై సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు సంబంధిత పత్రాలను తిరిగి ఇవ్వాలనీ, నాలుగు వారాలపాటు భూమిపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
కూకట్‌పల్లి భూముల వేలంపై పిల్
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హుడా ట్రక్ పార్కింగ్ స్థలాన్ని వేలం వేయకుండా నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మూసాపేట పరిధిలోని సుమారు 3.5 ఎకరాల భూమిని 1985లో ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం సేకరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ఈ స్థలాన్ని రవాణా అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వేలానికి ముందు సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలని కోరారు. ఇదే అంశంపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ రెండు వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.
సీజీహెచ్‌ఎస్ కార్డుతో జేఈఈ దరఖాస్తుకు అనుమతి
జేఈఈ మెయిన్స్–2027 పరీక్షలకు ఆధార్ కార్డుకు బదులుగా సీజీహెచ్‌ఎస్ గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఆధార్ లేకపోవడంతో దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొండాపూర్‌కు చెందిన విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీజీహెచ్‌ఎస్ కార్డు ఆధారంగా దరఖాస్తును స్వీకరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది.






కామెంట్‌లు (0)