మోడీ ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలను బలహీనపరిచింది :హెచ్‌ఆర్‌డబ్ల్యూ నివేదిక వెల్లడి
ఓటర్ల జాబితా సవరణ, దర్యాప్తు సంస్థల
వినియోగం, నిరసనల అణచివేతపై ఆందోళన
న్యూఢిల్లీ: మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించాల్సిన భారతదేశంలోని స్వతంత్ర సంస్థలను ప్రధాని మోడీ ప్రభుత్వం క్రమంగా బలహీనపరిచిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) నివేదించింది. “సో వాట్స్ దిస్ డెమొక్రసీ వి ఆర్ టాకింగ్ ఎబౌట్?” పేరుతో విడుదల చేసిన 95 పేజీల నివేదికలో, భారత్ నిరంకుశ పాలన దిశగా సాగుతోందని ఆ సంస్థ హెచ్చరించింది
పార్లమెంటరీ ప్రక్రియలు, ప్రతిపక్షాలపై ఒత్తిడి, కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, న్యాయవ్యవస్థ పాత్ర ఈ నాలుగు ప్రధాన అంశాలపై నివేదిక విశ్లేషించింది. 2025 జనవరి నుంచి 2026 సెప్టెంబరు మధ్య న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు సహా అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసినట్లు హెచ్‌ఆర్‌డబ్ల్యూ తెలిపింది. “ప్రతి వ్యవస్థనూ లొంగదీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ గత ఏడాది చేసిన వ్యాఖ్యతో నివేదిక ప్రారంభమవుతుంది.
ఏకపక్షంగా సర్..
ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా, ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా సాగిందని, మహిళలు, పేదలు, మైనారిటీలు నష్టపోయారని నివేదిక తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల విషయం లో ప్రధాని మోడీ, బిజెపి సీనియర్ నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని కూడా నివేదిక విమర్శించింది. ఓటర్ల జాబితాల్లో అవకత వకలు, పోలింగ్ డేటా వెల్లడించకపోవడం, ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో జోక్యం వంటి ఆరోపణలపై విశ్వసనీయ విచారణ జరగలేదని పేర్కొంది. ఆరు రాష్ట్రాలు, ఢిల్లీలో తొలగించిన ఓటర్లకు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సంఘం సమర్థించుకుంది. తన ఆదేశాలు ఏకగ్రీవంగా తీసుకున్నవేనని, ఫారం-6లో మార్పు లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 90 లక్షల మంది పేర్లు మొత్తం ఓటర్లలో దాదాపు 12 శాతం జాబితాల నుంచి తొలగించినట్టు హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. సర్ పౌరసత్వ పరీక్ష కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ఎడాది డిసెంబరులో ఈ ప్రక్రియను చొరబాటుదారులను “గుర్తించి, తొలగించి, బహిష్కరించే” మార్గంగా అభివర్ణించారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. బెంగాల్, బీహార్‌లలో జాబితాల నుంచి పేర్లు తొలగించినవారికి ఆహార రాయితీలు సహా కొన్ని సంక్షేమ పథకాల అర్హత ఉండదని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించినట్టు నివేదిక తెలిపింది
సర్‌ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కోరుతూ జరిగిన నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిరసనకారులపై నిర్బంధం, మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేయడం, ఢిల్లీలో 40 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించడం, వేలాది మందిని నిర్బంధించడం వంటి చర్యలను నివేదిక ప్రస్తావించింది.
2023 డిసెంబరులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై కార్యనిర్వాహక వర్గం నియంత్రణను బలపరిచే, విధుల నిర్వహణకు సంబంధించి వారికి విస్తృత చట్టపరమైన రక్షణ కల్పించే చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. ఆ సమయంలో లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు.
2014–24 మధ్య లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉన్న కాలంలో పార్లమెంటరీ కమిటీల పరిశీలనను ప్రభుత్వం పక్కనపెట్టిందని, ప్రతిపక్షాలకు కీలక పదవులు కల్పించకుండా ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిందని నివేదిక ప్రస్తావించింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం, 2014–19 మధ్య 28 శాతం, 2019–24 మధ్య 16 శాతం బిల్లులు మాత్రమే కమిటీలకు వెళ్లాయి. అంతకుముందు రెండు లోక్‌సభ కాలాల్లో ఈ శాతం వరుసగా 71, 60గా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
రాజ్యసభ ఆమోదం అవసరం లేని “మనీ బిల్లులు”గా వర్గీకరించి, ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపే కొన్ని చట్టాలను ఆమోదించారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలను విస్తరించిన 2019 సవరణను ఉదాహరణగా చూపింది. ఈ విధానాన్ని “రాజ్యాంగ ప్రక్రియ దుర్వినియోగం”గా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభివర్ణించినట్లు నివేదిక ఉటంకించింది. ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా అదే ఏడాది ఉపా చట్టానికీ సవరణలు చేసినట్టు తెలిపింది.
193 మందిపై ఈడీ కేసులు.. శిక్ష పడింది ఇద్దరికే
సీబీఐ, ఈడీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లను కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. విదేశీ నిధులు, ఆర్థిక చట్టాల కింద హక్కుల సంస్థలు, మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. 2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు రాజకీయ నేతలపై ఇడి 193 కేసులు నమోదు చేయగా, వాటిలో రెండింటిలోనే శిక్షలు పడ్డాయని కేంద్ర ఆర్థిక శాఖ 2025 మార్చిలో పార్లమెంటుకు తెలిపిన వివరాలను నివేదిక ప్రస్తావించింది. రాజకీయ నేతలపై దర్యాప్తుల సంఖ్య 600 శాతానికి పైగా పెరిగిందని, లక్ష్యంగా మారినవారిలో చాలామంది ప్రభుత్వ ప్రత్యర్థులని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. అయితే ఈడీ కేసులను రాజకీయ అనుబంధం ఆధారంగా విభజించదని, పార్టీల వారీ వివరాలు తమ వద్ద లేవని కేంద్ర మంత్రి, మంత్రిత్వ శాఖ తెలిపినట్టు నివేదిక గుర్తుచేసింది. దర్యాప్తులో ఉన్న కనీసం 23 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరిన తర్వాత ఊరట పొందారన్న వార్తా కథనాలనూ విశ్లేషించింది. మానవ హక్కుల కార్యకర్తలపై ఉపా చట్టాన్ని ఉపయోగించారని కూడా నివేదిక తెలిపింది. ఫ్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, కస్టడీలో మరణించిన స్టాన్ స్వామి విషయాలను నివేదికలో పొందుపరిచింది.
న్యాయవ్యవస్థలో జోక్యం
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో కార్యనిర్వాహక వర్గం జోక్యం పెరుగుతోందని న్యాయ వాదులు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేసినట్టు నివేదిక తెలిపింది. పౌర స్వేచ్ఛల విషయంలో కార్యనిర్వాహక వర్గం హద్దులు దాటిన ప్పుడు న్యాయవ్యవస్థ గట్టిగా నిలబడలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ వ్యాఖ్యా నించినట్టు పేర్కొంది. భారత్‌ను “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణి స్తున్నమోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, విమర్శకులపై రాజ్యాంగ సంస్థలను ప్రయోగించడం ఆపి, ప్రజల హక్కులను రక్షించేలా వాటి స్వతంత్రతను పునరుద్ధరించాలని హెచ్‌ఆర్‌డబ్ల్యూ కోరింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో, వాణిజ్య, భద్రతా చర్చల్లో భారత్ మిత్రదేశాలు ఈ ఆందోళనలను లేవనెత్తాలని సూచించింది. “భారత స్వతంత్ర సంస్థలను ప్రభుత్వం డొల్లగా చేస్తోంది” అని సంస్థ ఆసియా డైరెక్టర్ ఎలెయిన్ పియర్సన్ వ్యాఖ్యానించినట్టు నివేదిక పేర్కొంది.







కామెంట్‌లు (0)