కేంద్రం ముసాయిదాపై నేతల తిరస్కరణ
లెఫ్టినెంట్ గవర్నర్, అధికారులకే పెత్తనం
ఎన్నికైన పాలక మండలికి పరిమిత అధికారాలపై ఆగ్రహం
లేహ్ : లడఖ్‌కు మరింత ప్రజాస్వామ్య పాలన కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రూపొందించిన పాలన ముసాయిదాతో అధికారాలను తన చేతుల్లోనే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అక్కడి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ), అధికారులకే అధికారం కట్టబెట్టి, ఎన్నికైన పాలక మండలికి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఇచ్చేలా ముసాయిదా ఉందని కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) శనివారం దానిని తిరస్కరించింది. మే 22న జరిగిన సమావేశంలో అంగీకరించిన అంశాలకు భిన్నంగా అక్టోబర్ 15న కేంద్ర హోంశాఖ ఈ ముసాయిదాను అందించిందని కేడీఏ సహ కన్వీనర్ అస్గర్ కర్బలాయ్ ఆరోపించారు. ఎన్నికైన సంస్థకు శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాలు ఇవ్వడంతోపాటు అధికార యంత్రాంగాన్ని దాని పరిధిలోకి తీసుకురావాలని గతంలో అంగీకరించినట్టు తెలిపారు.
రాజ్యాంగంలోని 371వ అధికరణ పరిధిలో లడఖ్‌కు ప్రత్యేక రక్షణలు కల్పించాలన్న ప్రతిపాదనకు బదులుగా, కేంద్రం అధికరణ 240 కింద పాలనకు ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర హోదా, భూమి, సహజ వనరులు, సంస్కృతిని కాపాడుకోవాలన్నది లడఖ్ ప్రజల ప్రధాన డిమాండ్లు. 2019లో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం లడఖ్‌ను శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చారు. దీంతో స్థానికులకు ప్రజాప్రాతినిధ్యం తగ్గిందన్న ఆందోళనలు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ 24న రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణల కోసం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించగా, 50 మంది గాయపడ్డారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోతే నిరసనలు, బంద్‌లు చేపడతామని కేడీఏ హెచ్చరించింది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేసి, లడఖ్ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్య అధికారాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.





కామెంట్‌లు (0)