ప్రస్తుత స్థానాల సంఖ్యలోనే
మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
రాష్ట్రాల సీట్ల వాటాను మరో 25 ఏండ్లపాటు కొనసాగించాలి :ఇండియా బ్లాక్ సమావేశంలో
మూడు ప్రధాన డిమాండ్లపై నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇండియా బ్లాక్ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చింది. లోక్‌సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలనీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రస్తుత స్థానాల్లోనే అమలు చేయాలనీ, రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాల పంపిణీని మరో 25 ఏండ్లపాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించారు. డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్లను దానితో ముడిపెట్టడం సరికాదని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకం కాదని, వాటిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా అమలు చేయాలని స్పష్టం చేశాయి. బిల్లును ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని నిర్ణయించాయి. సభలో ప్రతి ఎంపీ హాజరయ్యేలా చూడాలనీ, డీఎంకే, ఎన్‌సీపీలతో చర్చలు కొనసాగించి వాటి వైఖరిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. వామపక్ష పార్టీలతో సహా 11 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజూ జనతాదళ్ (బీజేడీ)కు ఆహ్వానం పంపినప్పటికీ అవి సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్, ఆర్‌జెడి నేతలు మనోజ్ ఝా, అభరు కుష్వాహా, సీపీఐ(ఎం) నేత ఎఎ రహీం, సీపీఐ నేత పి.సంతోష్ కుమార్, ఐయుఎంఎల్ నేత మహ్మద్ బషీర్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్, ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్, తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.
అధికార కేంద్రీకరణకు బీజేపీ కుట్ర : ఖర్గే
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడంతో అధికారాన్ని శాశ్వ తంగా కేంద్రీకరించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోం దని ధ్వజమెత్తారు. ఈ బిల్లు ఎస్సీ, ఎస్టీల ప్రయోజ నాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయిం చినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో బీజేపీ ‘400 పార్’ నినాదం ఇచ్చిందనీ, దానిని ప్రజలు తిరస్క రించారని ఖర్గే గుర్తుచేశారు. ఇప్పుడు లోక్‌సభ స్థానా లను 850కి పెంచి ‘800 పార్’ లక్ష్యంతో ముందుకు సాగుతోందని విమర్శిం చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాం గాన్ని మార్చే అవకాశం పాలకులకు లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లోనే అధి కారం శాశ్వతంగా ఉండేలా చేయాలన్నది వారి లక్ష్య మని విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ ల ప్రాతినిధ్యాన్ని వారి జనాభా పెరుగుదలకు అను గుణంగా పెంచే అంశంలేదని ఖర్గే విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు.తాజా జనాభా లెక్కల ఆధా రంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ వర్గా లకు మరిన్ని స్థానాలు లభించే అవకాశం ఉందని, కానీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమ ర్శించారు. ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించారనే ఆరోపణలు ఉన్న సంస్థకు డీలిమిటేషన్ బాధ్యతలు అప్పగించడం సరికాద న్నారు. అసోం, జమ్మూకాశ్మీర్‌లో గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అధికార పార్టీకి అనుకూలంగా సీట్ల సరిహద్దులు, రిజర్వేషన్లను మార్చారని విమర్శించారు.






కామెంట్‌లు (0)