ప్రజల గొంతుకనై గళమెత్తుతా.. అన్నదాతలకు అండగా నిలిచా..
భూపోరాట బాధిత కుటుంబాలకు బాసటగా ఉన్నా..ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలిచా..
నవతెలంగాణతో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల
పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ ముఖాముఖి
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల గొంతుకనై శాసనమండలిలో బలంగా గళమెత్తుతానని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి కొల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి వై.శ్రీనివాస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన ప్రస్థానం, సామాజిక పోరాటాలు, న్యాయవాద వృత్తి అనుభవాలు, పట్టభద్రుల సమస్యలపై తన దృక్పథాన్ని వివరంగా పంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసిన అనుభవంతో శాసనమండలి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, వారి గౌరవాన్ని మరింత పెంచేలా మండలిలో వ్యవహరిస్తానని చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా..
విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యతను ఒక భాగంగా స్వీకరించాను. 1978లో ఖమ్మంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం జరిగిన ఉద్యమంపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో తాను కీలక పాత్ర పోషించాను. యువజన సంఘం అధ్యక్షునిగా నిరుద్యోగ సమస్యలపై సాగిన అనేక పోరాటాల్లో భాగస్వామినయ్యాను. సారా వ్యతిరేక, మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాను. చైతన్య వేదిక ద్వారా విద్య, వైద్య రంగాల్లో వస్తున్న మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. లయన్స్ క్లబ్ జోన్ చైర్మెన్‌గా పేదలకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు గ్రామాల్లో బస్ షెల్టర్లు, మంచి నీటి ట్యాంకుల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాను.
న్యాయవాదిగా ప్రజాసమస్యలపై కోర్టులో పోరాటం
న్యాయవాదిగా 1984 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఏఐఎల్యూ-ఐలు) కోశాధికారిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నానని కొల్లి సత్యనారాయణ వెల్లడించారు. న్యాయవాదుల సమస్యలు, సంక్షేమంతోపాటు కొత్తగా వచ్చే చట్టాల్లోని లోపాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. బార్ కౌన్సిల్‌కు మూడుసార్లు ఎన్నికై పని చేసిన అనుభవం ఉంది. పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పిన సందర్భంలో అన్నదాతల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు న్యాయస్థానంలో పోరాటం చేశాను. ముదిగొండ భూపోరాట కాల్పుల్లో ప్రాణం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచి న్యాయపోరాటం చేశాను.
ప్రజా సమస్యలకు మద్దతుగా..
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ పోరాటాలకు మద్దతుగా నిలిచానని కొల్లి అన్నారు. 58 రోజులపాటు సాగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, డీ-ఫార్మా విద్యార్థుల పోరాటాలు, కాంట్రాక్టు లెక్చరర్లు, అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలకు అండగా నిలిచాను. చౌటుప్పల్ ప్రాంతంలో బీసీ, ఎస్సీ సామాజిక తరగతులకు చెందిన ఇద్దరిని పెత్తందారులు సజీవ దహనం చేసిన దుర్మార్గ ఘటనపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఒక సామాజిక కార్యకర్తగా చట్టపరమైన పోరాటం చేసి విజయం సాధించాను. పర్యావరణ సమస్యలపై న్యాయస్థానాల ద్వారా ప్రజల ప్రయోజనాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కృషి చేశాను.
ప్రజా గొంతుకగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ..
డాక్టర్లు, న్యాయవాదులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సహా విద్యా, వైద్య రంగాల్లోని మేధావులు, వృత్తి నిపుణుల సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తున్నానని కొల్లి సత్యనారాయణ తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ప్రయివేటు ఉద్యోగులు, గిగ్ వర్కర్లు, నిరుద్యోగుల సమస్యలపై అధ్యయనం చేస్తూ పరిష్కార మార్గాలను సూచించాను. ప్రయివేటు విద్యాసంస్థల సమస్యలపై న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించాను. ఈ సుదీర్ఘ అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యలన్నింటినీ శాసనమండలిలో బలంగా వినిపించి పరిష్కారాల కోసం కృషి చేయాలనే సంకల్పంతో ప్రజాసంఘాలు, పౌర సమూహ ప్రతినిధులు, మేధావుల మద్దతుతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.





కామెంట్లు (0)