నిద్రలోనూ పక్కనే ఫోన్..దూరంగా పెడితే మంచిది
ఆరోగ్యం, ఏకాగ్రత దెబ్బతింటాయని నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. అది లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడుతోంది. అన్నపానీయాలు లేకపోయినా సరే...స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనే అభిప్రాయం ప్రబలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతున్నారు. పగటి పూట సరే... రాత్రి వేళ కూడా పక్కలో ఫోన్ ఉండాల్సిందే. పడుకునేటప్పుడు ఫోన్‌ను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా అదెలా కుదురుతుందని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఏదేమైనా పడక పక్కన పెట్టుకునే ఫోన్ పాము వంటిదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు.
నిద్రకు దూరమైతే అనారోగ్యం తప్పదు
రాత్రి పూట ఫోన్ వాడకం టీనేజర్ల నిద్ర సమయాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నది టీనేజర్లు మాత్రమే కాదు...స్మార్ట్ ఫోన్ వాడకంతో తమ నిద్రకు ఆటంకం కలుగుతోందని పెద్దలు కూడా చెబుతున్నారు. రాత్రి సమయంలో ఫోన్‌ను దూరంగా ఉంచితే హాయిగా నిద్ర పోవచ్చునని నిపుణులు చెబుతున్నా అదంత ఈజీ కాదని కొట్టిపారేస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఫోన్లను పడక గదిలో దూరంగా ఉంచితే ఫర్వాలేదు. కప్పుకునే దుప్పటి కింద పక్కనే పెట్టుకుంటున్నారు. పర్సనల్ అండ్ యుబిక్విటస్ కంప్యూటింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 42 శాతం మంది రాత్రి నిద్ర పోయే ముందు స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా నిద్రలో నాణ్యత కొరవడి అనారోగ్యాలకు దారితీస్తోంది.
పక్కన ఉంటే నిద్రెలా పడుతుంది ?
కొందరైతే ఫోన్‌ను అలారం వాచ్‌గా లేదా అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే సాధనంగా వాడుతున్నారు. కొందరికి ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి రంగు కాంతి... రాత్రిపూట సహజంగా నిద్రకు మనల్ని సిద్ధం చేసే సిర్కాడియస్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. అటువంటి కాంతిని పరిమితం చేయడానికి స్మార్ట్‌ఫోన్లు ఫిల్టర్లను అందిస్తున్నప్పటికీ వాటిని ఆన్ చేయడం, నిద్ర వేళలో ఫోన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించలేమని నిపుణులు తెలిపారు. మనం ఫోన్‌లో చేసే పనులు మెదడును చురుకుగా ఉంచుతాయి. ఫోన్‌లో చూసే ఉత్తేజభరితమైన కంటెంట్ కారణంగా మనం కోరుకునే సమయంలో నిద్రపోవడం సాధ్యం కావడం లేదు. తగినంత సమయం విశ్రాంతి తీసుకోవడం కూడా కుదరడం లేదు. ఫోన్‌ను ఉపయోగించనప్పటికీ అది మనకు చేరువగా ఉంటే నిద్రపోవడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. ఫోన్‌లో ఏవైనా మెస్సేజ్‌లు వస్తాయేమో లేదా నోటిఫికేషన్స్ వస్తాయేమో అని ఎదురు చూపులు చూస్తూ ఉంటే అర్థరాత్రి వేళ నిద్రాభంగం కలగక తప్పదు.
పడకగదిలో ఫోన్ లేకుంటే...
పడకగదిని కేవలం నిద్ర కోసం, దాంపత్య జీవనం కోసం మాత్రమే ఉపయోగిస్తే ఆ ప్రదేశంలో జరిగే పనులతో మనసుకు ఉంటే అనుబంధం బలపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పగటి వేళ గది నుంచి ఫోన్‌ను తీసేసి చూడండి...లేదా పడకపై దాని వాడకాన్ని ఆపేసి చూడండి...అప్పుడు నిద్ర బాగా పట్టిందన్న భావన కలుగుతుంది. కాబట్టి రాత్రి వేళలో కూడా ఇదే సూత్రాన్ని పాటించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం...వారం రోజుల పాటు పడక గదిలో ఫోన్ లేకపోతే త్వరగా నిద్ర పట్టిందని నాలుగింట మూడు వంతుల మంది చెప్పారు. అలాగే ఆందోళన తగ్గిపోయిందని, గాఢ నిద్రలో ఉండిపోయామని కూడా తెలిపారు. ఫోన్ అందుబాటులో లేనప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు పెరుగుతాయి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడు నిద్ర వేళ భాగస్వాములతో మాట్లాడే సమయం కూడా పెరుగుతుంది.
కొంపలేమీ మునగవు
ఏకాగ్రతను ఫోన్ దెబ్బతీస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. ఫోన్ పక్కన ఉంటే మనం వేరే పని మీద ఉన్నప్పటికీ కొంత దృష్టి దాని మీదకే వెళుతుంది. గదిలో ఫోన్ ఉండడం చెడ్డ విషయమేమీ కాదు. అయితే అది చాలా మందికి బలమైన ప్రలోభం. కొన్ని సందర్భాలలో ఫోన్‌ను పక్కన ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అప్పుడు పక్కనే ఫోన్ ఉంచుకోక తప్పదు కదా. అలాంటప్పుడు 'డోంట్ డిస్టర్బ్' అనే ఫీచర్‌ను ఆన్‌లో ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే అది నోటిఫికేషన్లను పరిమితం చేస్తుంది. తల్లిదండ్రుల నుంచి కాల్ వస్తే తప్ప రాత్రి వేళ పదే పదే నోటిఫికేషన్లు రావు. మానవ చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే ఫోన్లు అందుబాటులోకి వచ్చి కొంతకాలమే అవుతోంది. మొదట్లో లాండ్‌లైన్ ఫోన్లు ఉండేవి. నిద్ర లేపడానికి అలారం గడియారాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను ఊహించుకోవడమే కష్టంగా ఉంటోంది. ఫోన్‌ను దూరంగా పెట్టి పడుకుంటే కొంపలేమీ మునిగిపోవు. దానిని దూరం పెడితే అదే అలవాటు అవుతుంది.
ఇలా చేసి చూడండి
ఫోన్‌లో అలారం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పడక పక్కన సాధారణ గడియారాన్ని పెట్టుకొని అలారం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఐఫోన్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవడం కూడా కొంత వరకూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా మూడు నిమిషాల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు కాల్ చేస్తే 'డోన్ట్ డిస్టర్బ్' మోడ్‌లో ఉన్నప్పటికీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆపిల్, ఆండ్రాయిడ్ పరికరాల్లో ఫోన్ యొక్క డీయస్‌డీ సెట్టింగ్స్‌ను మారిస్తే ఇలాంటి రిపీటెడ్ కాల్స్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు.






కామెంట్‌లు (0)