Magazines

పార్లమెంట్‌ షురూ

32 నిమిషాల క్రితం

Parliament
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

30న లోక్‌సభ.. డిసెంబర్‌ 2న రాజ్యసభ

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ

అత్యవసర ప్రభుత్వ 
కార్యకలాపాల కోసం వచ్చే వారం పునఃసమావేశాలు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లులపై ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చే వారం పార్లమెంట్‌ను తిరిగి సమావేశపర్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం లోక్‌సభను నవంబర్‌ 30న, రాజ్యసభను డిసెంబర్‌ 2న సమావేశపర్చాలని స్పీకర్‌, ఛైర్మన్‌లను కోరినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం వెల్లడించారు. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలను బట్టి డిసెంబర్‌ 3 నాటికి ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. లోక్‌సభ రెండు రోజులు, అనంతరం రాజ్యసభ మరో రెండు రోజులు సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ పునఃసమావేశాల ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850కు పెంచి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల వాటా తగ్గే ప్రమాద ముందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా సీట్ల పెంపుపై కేంద్రం స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం మేర సీట్లు పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల పంపిణీని యథాతథంగా కొనసాగించే ప్రత్యామ్నాయమూ పరిశీలనలో ఉంది.


దీనిపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ఇప్పటివరకు అధికారికంగా ముగించకపోవడం కూడా పార్లమెంట్‌ను తిరిగి సమావేశపర్చడానికి వీలు కల్పించింది. 100 రోజులకు పైగా సమావేశాలు ముగింపు ప్రక్రియ (ప్రొరోగేషన్‌) చేపట్టకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది.పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే డీలిమిటేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందక పోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. మహిళలకు న్యాయం జరగకుండా ఒక ప్రతిపక్ష పార్టీ అడ్డుకుందని ఆరోపించారు. గురువారం పలు పత్రికల్లో ప్రచురితమైన వ్యాసంలో రాజ్యాంగ విలువలను ప్రతిపక్షం నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. మహిళలకు న్యాయం జరిగేలా చూడటాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని హామీ ఇచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్