పలు చోట్ల తడిసిపోయిన కుప్పలు
ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల డిమాండ్
నవతెలంగాణ-దోమకొండ/భిక్కనూర్
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, భిక్కనూర్ మండలాల్లో అకాల వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అలాగే వర్షపునీరు ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. దోమకొండ మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, ధాన్యం బస్తాలు పూర్తిగా వర్షానికి తడిసిపోయాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడంతో ధాన్యం కుప్పలుగా ఉన్నాయని, ధాన్యాన్ని ఆరబెట్టి.. మ్యాచర్ వచ్చినా సిబ్బంది తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
భిక్కనూర్ మండలంలో కురిసిన అకాల వర్షానికి కొన్ని చోట్ల వడ్లు తడిసిపోగా.. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో ధాన్యం మొత్తం తడిసిపోయింది. రైతు పంటను ఎంతో శ్రమించి ఎండబెట్టి, రెండు రోజుల్లో ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. సుమారు 50 నుంచి 60 క్వింటాళ్ల ధాన్యం నష్టపోయిందని, దాదాపు రూ.1.50 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు మాధవరెడ్డి, సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పంట నష్టాన్ని పరిశీలించారు. మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పంట నష్టం వివరాలను సేకరించి జిల్లా అధికారులకు పంపించారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.






కామెంట్‌లు (0)