Magazines

డీమానిటైజేషన్‌కు పదేండ్లు

1 గంట క్రితం

Ten Years of Demonetisation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 4 నిమిషాల చదవడం

పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమిటి?

నల్లధనం, అవినీతి కట్టడిలో విఫలం
నగదుపై ఆధారపడటం తగ్గలేదన్న ఆర్బీఐ గణాంకాలు

ఉగ్రవాదానికి నిధుల అడ్డుకట్టలోనూ వెనుకంజ

ఎన్నికల్లో పెరుగుతున్న నగదు పట్టివేతలు

మోడీ హామీలకు భిన్నంగా అధికారిక గణాంకాలు

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదానికి నిధుల సరఫరాను అరికడతామని గొప్పగా ప్రకటించిన మోడీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని పదేండ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగదు చెలామణి కొనసాగుతూనే ఉండగా.. అవినీతి సూచీలో భారత్‌ స్థానం పెద్దగా మెరుగుపడలేదు. హవాలా, అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అరికట్టడంలోనూ ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఎన్నికల్లో నగదు పట్టివేతలు భారీగా పెరగడం నల్లధనం సమస్య తీవ్రతను చాటుతోంది. నాడు ప్రజలపై తీవ్ర కష్టాలు మోపిన నోట్ల రద్దు.. పదేండ్ల తర్వాత కూడా తన లక్ష్యాలను చేరుకోలేదని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తుందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్పిన నిర్ణయం. 2016 నవంబర్‌ 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దేశంలో చెలామణిలో ఉన్న నగదులో దాదాపు 86 శాతం ఒక్కసారిగా పనికిరాకుండా పోయింది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. చిరు వ్యాపారులు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ తాత్కాలిక కష్టాలను భరిస్తే దేశానికి మేలు జరుగుతుందని మోడీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నాలు చేసింది.నల్లధనాన్ని వెలికితీయడం, అవినీతిని అరికట్టడం, నకిలీ కరెన్సీని నిర్మూలించడం, ఉగ్రవాదానికి నిధుల సరఫరాను నిలువరించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలని ప్రధాని ప్రకటించారు. దేశాన్ని శుద్ధి చేసే గొప్ప త్యాగంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కానీ... పదేండ్ల తర్వాత అందుబాటులో ఉన్న ప్రభుత్వ గణాంకాలు, అంతర్జాతీయ నివేదికలు ఈ హామీలకు భిన్నమైన పరిస్థితిని చూపుతున్నాయి.


నగదు చెలామణికి అడ్డుకట్ట పడలే!

నోట్ల రద్దు సమయంలో దేశ నగదు విలువలో 80 నుంచి 90 శాతం వరకు పెద్ద నోట్ల వాటా ఉందని మోడీ వివరించారు. పదేండ్ల తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. రూ.2,000 నోట్లను ఉపసంహ రించినప్పటికీ.. ప్రస్తుతం అత్యధిక విలువ కలిగిన నోటుగా ఉన్న రూ.500 నోటు 2025-26లో మొత్తం నగదు విలువలో 85.5 శాతం వాటా కలిగి ఉంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.10 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై ఆర్థిక సంస్థలు నమోదు చేసే నగదు లావాదేవీల నివేదికలు కూడా 2023 నుంచి నోట్ల రద్దుకు ముందు స్థాయిలను మించిపోయాయి. అంటే నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో నోట్ల రద్దు ప్రభావం పరిమితంగానే ఉందని స్పష్టమవుతోంది.

సమసిపోని నకిలీ నోట్ల సమస్య

దేశంలో నకిలీ నోట్ల గుర్తింపు శాతం తగ్గినప్పటికీ.. వాటి సమస్య పూర్తిగా తొలగిపోలేదు. 2014-15లో బ్యాంకుల్లో గుర్తించిన నకిలీ నోట్లు మొత్తం నోట్లలో 0.00071 శాతం ఉండగా.. 2025-26లో 0.00013 శాతానికి తగ్గాయి. ఆర్థిక సంస్థలు నమోదు చేసిన నకిలీ కరెన్సీ నివేదికలు కూడా 2015-16లో 4.1 లక్షల నుంచి 2024-25లో 2.1 లక్షలకు తగ్గాయి. అయితే, పోలీసుల స్వాధీనంలోకి వస్తున్న నకిలీ భారతీయ కరెన్సీ విలువ 2020 నుంచి కొన్ని సంవత్సరాల్లో పెరిగింది. 2022లో ఏకంగా రూ.382 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాద నిధుల కట్టడిలోనూ వైఫల్యం

ఉగ్రవాదానికి నిధుల సరఫరాను అరికట్టడంలోనూ భారత్‌ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని 2024లో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నివేదిక పేర్కొంది. ఉగ్రవాదానికి నిధుల సరఫరా నిరోధక సామర్థ్యాన్ని మధ్యస్థ స్థాయిలోనే ఉన్నట్టు అంచనా వేసింది. 2018 నుంచి 2023 మధ్య ఈ తరహా కేసుల్లో 1,530 మందిపై విచారణ జరగగా.. 89 మందికే శిక్షలు పడ్డాయి. అంటే దోషులుగా నిర్ధారణైన వారి శాతం దాదాపు ఆరు మాత్రమే. విచారణలు, న్యాయ ప్రక్రియల్లో తీవ్ర జాప్యం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

హవాలా, అక్రమ ఆయుధాల వ్యాపారానికి అడ్డుకట్ట ఏదీ?

హవాలా లావాదేవీలు, అక్రమ ఆయుధాల వ్యాపారానికి నగదు చెలామణి ఊతమిస్తుందని నాడు ప్రధాని చెప్పారు. కానీ, మనీలాండరింగ్‌ను అరికట్టే సామర్థ్యంలో భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడింది. బాసెల్‌ మనీలాండరింగ్‌ సూచీలో 2014లో 162 దేశాల్లో 88వ స్థానంలో ఉన్న భారత్‌.. 2025లో 177 దేశాల్లో 60వ స్థానానికి దిగజారింది. ఈ సూచీలో సంఖ్యాపరంగా తక్కువ స్థానం అంటే మనీలాండరింగ్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు అర్థం. మరోవైపు, అక్రమ ఆయుధాల వ్యాపారంపై గ్లోబల్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఇండెక్స్‌ భారత్‌ రేటింగ్‌ను 2021లో 5.5గా, 2023లో 6గా నమోదు చేసింది. 2025లోనూ అదే స్థాయిలో కొనసాగింది. డ్రోన్ల ద్వారా సరిహద్దుల మీదుగా ఆయుధాల రవాణా ఆందోళనకరంగా ఉందని నివేదిక పేర్కొంది.

తగ్గని అవినీతి

అవినీతిని నిర్మూలిస్తామని నోట్ల రద్దు సందర్భంగా మోడీ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అవినీతి అవగాహన సూచీలో 2013లో భారత్‌ 94వ స్థానంలో ఉండగా.. 2025లో 91వ స్థానంలో ఉంది. నోట్ల రద్దులో కీలకమైన అవినీతి నిరోధం అనేది సాధ్యం కాలేదు. పదేండ్ల తర్వాత కూడా గణనీయమైన మెరుగుదల కనిపించలేదు. బినామీ ఆస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. 2017 నుంచి 2024 వరకు ఈ చట్టం కింద నమోదైన కేసులు ఏడు మాత్రమే. 2024లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే 2019 నాటికే రూ.9,600 కోట్లకు పైగా విలువైన బినామీ ఆస్తులకు సంబంధించి 2,100కుపైగా నోటీసులు జారీ చేసినట్టు గతంలో ప్రభుత్వం వెల్లడించింది.

ఎన్నికల్లో నల్లధనం ప్రవాహం పెరుగుదల

ఎన్నికల్లో నల్లధనం వినియోగాన్ని అరికడతామని చెప్పినప్పటికీ.. ఎన్నికల సమయంలో నగదు పట్టివేతలు భారీగా పెరిగాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రూ.304 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, 2019లో రూ.804 కోట్లు, 2024లో రూ.1,067 కోట్లకు పెరిగింది. 2016లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.147 కోట్ల నగదు పట్టుబడగా.. 2021లో అది రూ.348 కోట్లకు చేరింది. 2026లో మాత్రం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నగదు పట్టివేతలు రూ.155 కోట్లుగా నమోదయ్యాయి.

మొత్తానికి పదేండ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజలకు కష్టాలు మిగిల్చింది. నల్లధనం, అవినీతి, హవాలా, ఉగ్రవాద నిధుల సమస్యలను నిర్మూలించడంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నాటి భారీ ప్రకటనలకు, నేటి గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్