Magazines

పుస్తకాలు మార్చారు.. ఉపాధ్యాయులకు శిక్షణ మరిచారు

18 నిమిషాల క్రితం

textbooks...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 2 నిమిషాల చదవడం

బోధనా పద్ధతులు మార్చినా తరగతి గదుల్లో గందరగోళం
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం

కొత్త విద్యా విధానం అమలులో కేంద్రం నిర్లక్ష్యం

కోటి మంది టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు అందని శిక్షణ

న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ఆ మార్పులను అమలు చేయాల్సిన ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ కల్పించడంలో మాత్రం విఫలమవు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టిన కేంద్రం, వాటిని ఎలా బోధించాలనే అంశంపై ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కొత్త బోధనా పద్ధతులపై ఇంకా శిక్షణ పొందలేదని తాజా నివేదిక వెల్లడించింది. దీంతో కేంద్రం ప్రకటిస్తున్న విద్యా సంస్కరణలకు, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య అంతరం స్పష్టమవుతోంది.

గత నాలుగేండ్లలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టింది. పాత పుస్తకాల్లో పాఠ్యాంశాలను నేరుగా వివరించేవారు. కొత్త పుస్తకాల్లో మాత్రం కథలు, చిక్కు ప్రశ్నలు, ఉదాహరణల ద్వారా విద్యార్థులే విషయాలను విశ్లేషించి అర్థం చేసుకునేలా రూపొందించారు. ఈ విధానం విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నప్పటికీ.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఉపాధ్యాయులకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని జాతీయ పాఠ్యప్రణాళిక సూచించినా ఆ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదు. మరోవైపు, ఆన్‌లైన్‌, ప్రత్యక్ష విధానాల్లో శిక్షణ కొనసాగుతోందని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ చెప్తున్నారు. విద్యా విధానంలో మార్పుల పేరుతో పుస్తకాలు మార్చడం మాత్రమే సంస్కరణ కాదనీ, వాటిని సమర్థంగా బోధించేలా ఉపాధ్యాయులను సిద్ధం చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని మేధావులు అంటున్నారు. కేంద్రం ప్రచారానికి ప్రాధాన్యమిస్తూ.. అమలుకు అవసరమైన ఏర్పాట్లను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది చివరకు విద్యార్థుల భవిష్యత్తేనని హెచ్చరిస్తున్నారు.

గందరగోళంలో ఉపాధ్యాయులు

కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు తమకు ఇప్పటివరకు తగిన శిక్షణ ఇవ్వలేదని వెల్లడించారు. కొత్త సామాజిక శాస్త్ర పుస్తకాల్లో భారతీయ జ్ఞాన వ్యవస్థ పేరుతో హిందూ మత గ్రంథాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండటంతో వాటిని విద్యార్థులకు ఎలా వివరించాలో తెలియడం లేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. తరగతి గది కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే విషయంలోనూ సందేహాలున్నాయని మరికొందరు చెప్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్