నైపుణ్యతకు కేంద్రం పూర్తి సహకారం : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఎన్డీటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకారం : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ కేవలం వినియోగదారుగా కాకుండా, అభివృద్ధి చేసేదిగా, ఆవిష్కరణలకు కేంద్రంగా, ప్రపంచ నాయకుడిగా ఎదగాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్డీటీ) స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నవంబర్ 15 నుంచి 17 వరకు ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్డీఈ 2026, ఏరోనాట్ 2026 అంతర్జాతీయ సదస్సులను ఆదివారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సదస్సులో 2,000 మందికి పైగా నిపుణులు, 100కు పైగా సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సాంకేతికత నైపుణ్యతకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్డీటీ నిపుణులు తయారీ రంగానికి వైద్యుల్లాంటి వారని, పరిశ్రమల భద్రతలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. తెలంగాణలో ఎన్డీటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఐఎస్ఎన్టీ అధ్యక్షుడు, డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జైటీర్త్ ఆర్.జోషి మాట్లాడుతూ ఎన్డీటీ నిపుణులు కీలక పరిశ్రమల భద్రతకు కనిపించని రక్షకులని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ ఎన్డీటీ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్ డీడీఓ బ్రహ్మోస్, మిదాని ప్రతినిధులు, పారిశ్రామిక నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)