Magazines

మల్లన్నసాగర్ సమస్యలపై స్పందించాలి

12 నిమిషాల క్రితం

Must respond to the issues at Mallannasagar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

ముఖ్యమంత్రికి నిర్వాసితుల బహిరంగ లేఖ

నవతెలంగాణ-గజ్వేల్

ఈ నెల 19న సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న నిర్వాసితులు కోరారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలను ఆదివారం స్థానిక చౌరస్తాలో బహిరంగంగా ప్రజలకు అందించారు. సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి స్పందించకుంటే పోరాటానికి శ్రీకారం చుడుతామన్నారు. సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. పెండింగ్ పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను వెంటనే మంజూరు చేసి అందించాలని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు పంపిణీ చెయ్యాలన్నారు. పునరావాస కాలనీలలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి కనీస మౌలిక వసతులను కల్పించాలని, ప్రజల సౌకర్యార్థం అన్ని వర్గాల ప్రజలకు తగిన విధంగా శ్మశానవాటికలు నిర్మించాలని, బడి గుడి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలలోని ప్రజలకు (ఉపాధి హామీ) విబిగ్రాంజీ పథకాన్ని అమలు చేయాలని, కాలనీలోని నిర్మాణాలకు అనుమతులు మున్సిపల్ పన్నులను వచ్చే పది సంవత్సరాల పాటు మినహాయింపును ఇస్తూ వెంటనే జీవో జారీ చేయాలన్నారు. నిర్వాసిత బాధితుడు బండ్ల స్వామి మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటం సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల పక్షాన ఏటిగడ్డ కిష్టాపూర్ లో రెండు రోజుల దీక్ష చేసి ముంపు గ్రామాలకు అండగా నిలబడ్డారని, ప్రస్తుతం విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేసి న్యాయం చేయాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్