జులై 20నాటి నిరసనల్లో పోలీసుల అరాచకత్వంపై సుప్రీం వెల్లడి
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద జులై 20నాటి నిరసనల సందర్భంగా పోలీసుల అరాచకత్వంపై అతి తక్కు వగా ఫిర్యాదులే అందాయని వీటిపై విచారణ జరుపుతున్న ఉన్నత స్థాయి విచారణా కమిటీ (హెచ్‌పీఈసీ) తెలిపిందని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అక్టోబరు 31న జారీ చేసిన చర్యల నివేదిక (ఏటీఆర్) ప్రకారం భౌతికంగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. వీడియో క్లిప్‌లతో సహా తమ వద్ద ఏవి ఉంటే వాటన్నింటినీ హెచ్‌పీఈసీకి పరిశీలన నిమిత్తం పంపే స్వేచ్ఛను పిటిషనర్లకు కోర్టు ఇచ్చింది. హెచ్‌పీఈసీ కొత్త పోర్టల్‌ను ప్రారంభిం చింది. దానిద్వారా ఫిర్యాదులను అజ్ఞాతం గా కూడా నమోదు చేయవచ్చు.
ఆ రోజున పోలీసులు ఉపయోగించిన మందుగుండు సామగ్రి ఏ రకమో సమాచారాన్ని హెచ్‌పీఈసీ ముందు ఢిల్లీ పోలీసులు ఎందుకు ఉంచలేదని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు. బహుశా అన్ని వివరాలను, సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో పేర్చడానికి హెచ్‌పీఈసీ వేచి ఉండవచ్చునని కోర్టు పేర్కొంది. అయితే, తనకు అందిన సమాచారాన్ని కమిటీ పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా నిజ నిర్ధారణ నివేదికలను అందజేయాల్సి ఉందని తెలిపింది. నెల రోజుల్లోగా మొదటి నిజ నిర్ధారణ నివేదికను అందజేయాలని కోర్టు హెచ్‌పీఈసీని ఆదేశించింది. ఫిర్యాదుల కోసం నిరవధికంగా వేచి ఉండలేమని వ్యాఖ్యానించింది. గోప్యతను పాటించాల్సిన పరిస్థితులు తలెత్తితే తప్ప హెచ్‌పీఈసీ తన నిర్ధారణలను అన్ని పక్షాలతో పంచుకుంటుందని కోర్టు పేర్కొంది. తిరిగి డిసెంబరులో ఈ విషయంపై విచారణ చేపట్టనుంది.






కామెంట్‌లు (0)