త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ
రాష్ట్ర క్యాబినెట్ లో నిర్ణయాలు
వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు
డిసెంబర్ 7,8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర 38వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్ కటాఫ్ వాల్, డౌన్ స్ట్రీమ్, కాంక్రీట్ డయా ఫర్ వాల్ లోపాలను ఎన్డీఎస్ఏ గుర్తించి పలు సూచనలు చేసిందని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచించిన అన్ని పరీక్షలను నిర్వహించి సెంట్రల్ వాటర్ కమిషన్, ఎన్డీఎస్ఏకు నివేదించామన్నారు. వారి సూచనల మేరకు త్వరలోనే మూడు బ్యారేజీలకు సంబంధించి మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. డిసెంబర్ 7, 8 , 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి సంబంధించి సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులతో సహా అందరికి బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, ఇతర రంగాల్లో విధానాలను సరళీకృతం చేయడంతో రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా ముందుకెళ్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న రెండో గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్టు మంత్రి వెల్లడించారు.
అందుకే ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో మొదలు గ్రామ సర్పంచ్ వరకు అందరూ ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని ఒక ఇందిరమ్మ ఇంట్లో జరిగే దీపావళిలో పాల్గొనాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కొడంగల్ లో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్ పో తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇందులో రాష్ట్ర మంత్రులందరూ పాల్గొనాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వార్డు, గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దాంతో పాటు రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆమోదించినట్టు పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూములను వివిధ శాఖలకు అవసరాల రీత్యా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.






కామెంట్లు (0)