అద్దె చెల్లించని అధికారులు
నవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్
అద్దె చెల్లించకపోవడంతో మిర్యాలగూడ పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ భవనానికి యజమాని గురువారం తాళం వేశారు. మరోమారు తాళాలు పడటం తో వైద్య సేవల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరైన సమయంలో సేవలు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు నెలల కిందట అద్దె చెల్లించలేదంటూ సదరు భవన యజమాని తాళం వేశారు. అప్పుడు రెండు నెలలు అద్దె చెల్లిస్తామని అధికారుల నుంచి హామీ మేరకు డిస్పెన్సరీని కొనసాగించారు. ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో తిరిగి డిస్పెన్సరీ భవనానికి తాళం వేశారు. ప్రతిరోజూ సుమారు 200 నుంచి 300 మంది వరకు వైద్య సేవలు, మందుల కోసం ఈ కేంద్రానికి వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే విషయం తెలియక.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు డిస్పెన్సరీకి తాళాలు వేసి ఉండటంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






కామెంట్‌లు (0)