రాబోయే రోజుల్లో తాగునీటికి కష్టాలే : ఎస్ఈ మల్లికార్జున రావు
ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే గట్టెక్కే అవకాశం
నవతెలంగాణ - నాగార్జునసాగర్
సాగర్ జలాశయంలో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోకుంటే రాబోయే రోజుల్లో తాగునీటికి కష్టాలు తప్పవని డ్యామ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లికార్జునరావు అన్నారు. గురువారం ఆయన ‘నవతెలంగాణ’తో మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే అరకొరగా సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోకుంటే రాబోయే వేసవిలో తాగునీటికి తీవ్ర కటకట తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలోని జలాశయాల్లో నిల్వ ఉన్న నీటిని కేవలం తాగునీటి కోసమే కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, లీకేజీలను అరికట్టాలని కోరారు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 536.60 అడుగుల నీటిమట్టం ఉందని, ప్రస్తుతం 181 టీఎంసీల నీరు నిల్వ ఉండగా దానిలో 50 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ 50 టీఎంసీల నీటిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి తాగునీటికి జంట నగరాలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు 28 టీఎంసీల నీరు తాగునీటికి అవసరమన్నారు. పొదుపుగా వాడుకుంటే వచ్చే సంవత్సరం జులై వరకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని, వచ్చే ఏడాది కూడా ప్రస్తుత పరిస్థితులే ఉంటే తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.
సమావేశం వాయిదా
సాగర్ జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎంత మేరకు వాడుకోవాలి అనే విషయంపై గురువారం జరగాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం మూడోసారి సైతం వాయిదా పడింది.






కామెంట్లు (0)