ఎంపీ కృష్ణయ్య, వీఆర్ఏ జేఏసీ గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు
ఇందిరాపార్క్ వద్ద వీఆర్ఏల మహాధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వీఆర్ఏ అసిస్టెంట్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వీఆర్ఏలు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ జేఏసీ గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారని తెలిపారు. డిగ్రీ చదివిన వారిని సీనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్లుగా, పదో తరగతిలోపు చదివిన వారిని ఆఫీస్ సబార్డినేటర్లుగా నియమించారని చెప్పారు. మొత్తం 16,058 మందిని సర్దుబాటు చేయగా, మరో 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యకులు జె మల్లికార్జున్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి వీఆర్ఏల వారసులను మోసం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పలుమార్లు కలిసి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నా వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించిన వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోల ద్వారా పలువురికి ఉద్యోగాలు కల్పించిందని, ప్రస్తుతం 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. శాసనమండలిలో వీఆర్ఏల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 81, 85 జీవోలు అమలు చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఎదురుచూస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నీల వెంకటేష్, అనంతయ్య, నిఖిల్, జిల్లపల్లి అంజి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షులు భరత్, హరీష్ సాగర్, శ్రీకాంత్, రవిసాగర్, నాగేష్, సంగమేశ్వర్, నరసింహ, వివిధ జిల్లాల నుంచి వీఆర్ఏల వారసులు పాల్గొన్నారు.
వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



