ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌లకు న్యాయస్థానం బెయిల్ నిరాకరిం చింది. వాళ్లను జైల్లో పెట్టి ఐదేండ్లు గడిచిపోయాయి. ఇప్పటి వరకు విచారణ లేదు..ఏం చేశారు వాళ్లు! దేశ పౌరుల ఉనికిని ప్రమాదంలో నెట్టే ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడారు. పాలకులు కక్షపూరితంగా వారిని నిర్బంధించారు. పరిశోధన చేస్తున్న విద్యార్థులు వాళ్లు. కానీ బాబా వేషంలో మహిళలపై లైంగికదాడి చేసి, హత్యలకు పాల్పడ్డ డేరా బాబాకు నేరంపై శిక్షపడ్డా, పైకోర్టు ఇప్పటి వరకు పదిహేనుసార్లు పెరోల్‌పై బెయిల్ మంజూరు చేసింది. మత విద్వేషంతో అల్లర్లు చేసి విధ్వసం సృష్టించిన వారికీ సునాయాసంగా బెయిల్ ఇచ్చేసింది. దేశంలో న్యాయస్థానం ఒక్కటే.. న్యాయాలే రెండు రకాలు!
ఇప్పుడిది అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దేశ పౌరసత్వం కోసం పోరాడిన వారి వెనక న్యాయం ఉందని న్యూయార్క్ మేయర్ సైతం వారిని విడుదల చేయాలంటూ మద్దతు పలికారు. కన్నవారితో పాటు తమకోసం నిలబడ్డ యువ నాయకుల విడుదలకై కోట్లాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా మన న్యాయ వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల వైపునకే మొగ్గింది. ఇది అత్యంత బాధాకరం. దేశం కోసం మాట్లాడిన వారు జైల్లో ఉంటే, విద్వేషాలను రెచ్చగొడుతున్న దోషులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగు తున్నారు. చెప్పుకుంటూ పోతే దీనికి ఎన్నో ఉదాహరణలు.
క్రిస్మస్ ముందు రోజు డిసెంబర్ 24న మతమార్పిడులపై నిరసన పేరుతో బంద్‌కు పిలుపునిచ్చిన భగరంగ్‌దళ్ కార్యకర్తలు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మాల్‌లో దాడులకు తెగబడ్డారు. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మూడు వందల మంది భజరంగ్ దళియులు తొమ్మిది గంటల పాటు పోలీస్ స్టేషన్ రహదారినే దిగ్బంధించారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలూ లేవు. పైగా అరెస్టు చేసిన విధ్వంసకారులను కూడా బెయిల్‌పై విడుదల చేశారు. వీరికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అంతేనా వారిని భుజాలపై మోసుకుంటూ ఊరేగించారు. తమ వారిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. దేశంలో మతోన్మాదుల ఆగడాలు ఎంతగా పెచ్చరిల్లి పోతున్నాయో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. అలాగే రాజకీయ ఒత్తిడులకు న్యాయవ్యవస్థ కూడా ఎలా లొంగిపోతుందో ఈ ఘటన రుజువు చేస్తోంది.
ఇక తన ఆశ్రమంలోనే ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన డేరా బాబా ప్రధాన ఎన్నికలు జరుగుతున్న ప్రతీసారి పెరోల్‌పై బయటకు వచ్చేస్తుంటాడు. తాజాగా మరోసారి నలభై రోజుల పాటు బయటకు వచ్చాడు. 2017లో లైంగికదాడి కేసులో ఇరవైయేండ్లు జైలుశిక్ష పడిన ఈయన ఇప్పటికి పదిహేను సార్లు పెరోల్‌పై బయటికి వచ్చాడు. శిక్షపడిన నాటి నుండి జైల్లో కంటే ఆశ్రమంలోనే ఎక్కువ రోజులు గడిపాడు. దీన్నిబట్టి మన చట్టాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అంతేకాదు ఈ డేరా బాబా ఓ జర్నలిస్టు హత్య కేసులోనూ దోషిగా తేలాడు. ఇలాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తికి అండగా నిలబడి బీజేపీ ప్రభుత్వం న్యాయాన్ని అపహాస్యం చేస్తోంది. తన ఓటు బ్యాంకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది.
ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న నిందితులను కాపాడుకోవడమే కేంద్ర సర్కారు తన ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. దీనికోసం న్యాయవ్యవస్థను సైతం తనకు అనుకూలంగా ఉపయోగిస్తున్నది. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నది. వారి ఆడగాలకు ఎదురు తిరిగితే జైల్లో పెడుతుంది. అలా జైల్లో మగ్గుతున్న వారే ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్. 2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టింది. ముఖ్యంగా మైనార్టీలను టార్గెట్ చేస్తూ తెచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా 2020లో మతాలకతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనుకోకుండా ఆ నిరసన హింసాత్మకంగా మారింది. ఈ దేశంలో పుట్టి పెరిగిన వారిని మీరు ఈ దేశస్తులే కాదంటే ఎలా భరించగలరు? అందుకే తిరగబడ్డారు. కానీ రాజ్యం ఇది నేరంగా పరిగణించింది. వారిని జైల్లో నిర్భందించింది.
దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేవారు, విధ్వంసాలు సృష్టించేవారు, లైంగిక దాడులు, హత్యలు చేసేవారు బీజేపీ పాలనలో రాచమర్యాదలతో బయటకు వచ్చేస్తున్నారు. ‘మేమూ ఈ దేశ పౌరులమే’ అంటూ గొంతెత్తి నినదించిన విద్యార్థి నాయకులు మాత్రం కటకటకాల్లో మగ్గుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువత జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు. బీజేపీకి కావల్సింది కూడా ఇదే. చివరకు కోర్టులు సైతం మతోన్మాదులకే వత్తాసు పలకడం బాధాకరం. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు అండగా నిలబడాల్సిన న్యాయవ్యవస్థ ఇలా మారడం అత్యంత విషాదం. న్యాయమే అన్యాయం చేస్తే ఇక ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?
న్యాయం దొరకలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



