Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్‌

బీసీ రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్‌

- Advertisement -

– 2018 పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ
– స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు
– వచ్చే ఏడాది మార్చిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ
– గోశాలల ఏర్పాటు, నిర్వహణపై కొత్త పాలసీ
– రెండు విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా
– మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు
– మళ్లీ 25న క్యాబినెట్‌ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. దానికోసం 2018నాటి పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. వాటి వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు మీడియాకు వివరించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించిన కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

ప్రతి మూడు నెలలకోసారి క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించాలని తీర్మానించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఏఎమ్‌ఐటీవై, సెయింట్‌ మేరీ రిహాబిలిటేషన్‌ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లలో 50 శాతం అవకాశం కల్పించాలనే నిబంధన విధించామన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాల్టీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణపై నూతన విధానాల రూపకల్పనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

వచ్చే క్యాబినేట్‌ సమావేశం లోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు విధించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయనీ, హైదరాబాద్‌లోని ఎన్కేపల్లిలో వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026 మార్చి వరకు కొత్తగా లక్ష ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ”కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర వ్యవధిలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. 22,033 ఉద్యోగాలకు త్వరలోనోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థికశాఖను ఆదేశించాం” అని మంత్రులు వివరించారు. మత్య్స అభివృద్థి శాఖకు రూ.121 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో 82 కోట్ల చేప పిల్లలను వదలాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఈనెల 25న మళ్లీ క్యాబినెట్‌ సమావేశం జరుగుతుంది.


చారిత్రాత్మక నిర్ణయం : మహేశ్‌కుమార్‌ గౌడ్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లకు స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగు పెట్టడం విప్లవాత్మక నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంపై వివిధ బీసీ సంఘాలు హర్షం ప్రకటించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -