– కాటారం మద్యం రాజధానిగా మారిందా?
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో మద్యం అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “లిక్కర్ డాన్”గా పేరొందిన ఓ వ్యక్తి వ్యవస్థనే శాసిస్తున్నాడన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎక్సైజ్ శాఖ నుంచి, ప్రజాప్రతినిధుల వరకు అందరూ మౌనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా “రెడ్డిసాబ్ బయటకు వస్తున్నాడు” అనే మాట వినిపిస్తే కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు అప్రమత్తమవుతారని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాటారం ఇప్పుడు గ్రామం కాకుండా “లిక్కర్ రాజధాని”గా మారిందని, బెల్ట్ షాప్‌లు బూమ్‌లో ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
మండలంలో 500కి పైగా బెల్ట్ షాప్‌లు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రోజుకు లక్షల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి పది ఇళ్లకు ఒక బెల్ట్ షాప్, ప్రతి వీధికి ఒక లిక్కర్ ఏజెంట్, ప్రతి యువకుడికి అప్పుల పుస్తకం అన్న పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. “రోడ్లు అవసరం లేదు… మద్యం దుకాణాలే సరిపోతాయి. ఉద్యోగాలు అవసరం లేదు… బెల్ట్ షాప్‌లే ఉపాధి” అన్నట్లుగా అభివృద్ధి మద్యం ఆధారితంగా మారిందని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. కాటారం మండలం ఇప్పుడు ఓ వ్యక్తి పాలిస్తున్న లిక్కర్ సామ్రాజ్యంగా మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిపై ఎక్సైజ్ శాఖ స్పందించకపోవడం, మీడియా ప్రకటనల మత్తులో ఉండటం, ప్రజాప్రతినిధులు లిక్కర్ లాబీలో భాగమయ్యారని ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో కాదు, అప్పుల మత్తులో ప్రజలు కూరుకుపోతున్నారని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాప్‌లపై తక్షణమే దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



