నవతెలంగాణ – పరకాల : పట్టు పట్టరాదు పట్టి విడువరాదు’ అన్నాడు ప్రజాకవి వేమన. వేమన చెప్పిన మాటను నిజం చేస్తూ.. ఆర్గనైజేషన్ మరియు వర్కింగ్ ఇందిరమ్మ హౌసెసింగ్ స్కీం ఇన్ ఆంధ్రప్రదేశ్ అంశంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మడికొండ శ్రీను డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మడికొండ సారమ్మ, పోషయ్య దంపతులకు జన్మించారు. 1వ తరగతి 10వ తరగతి వరకు పరకాల పట్టణంలోని సిఎస్ఐ మిషన్ స్కూల్లో, పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, హనుమకొండ ఎల్బీ కాలేజీ, పిజీ, పిహెచ్ డి హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయం పూర్తి చేసుకుని.. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో దివంగగత అసిస్టెంట్ ప్రొఫెసర్ పసల సారయ్య, పెద్దమల్ల శ్రీనివాసరావు పర్యవేక్షణలో పిహెచ్.డి. పూర్తి చేశారు.
వీరు చేసిన పరిశోధనకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23వ స్నాతకోత్సవం కార్యక్రమంలో డాక్టర్ మడికొండ శ్రీనుకి ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ప్రధానం చేయడం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్, వైస్ ఛాన్సెలర్ ప్రతాప్ రెడ్డి, ఎగ్జామ్ నేషన్ కంట్రోలర్ రామ్ చంద్రం, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరకాల పట్టణవాసులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ, కాకతీయ విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకోవటం, పిహెచ్.డి. పట్టాను అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. డా.మడికొండ శ్రీనును ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో దళితులు , బుడుగు, బలహీన వర్గాల పిల్లలు చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాలపై మరిన్ని పరిశోధనలు జరపాలన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.