-సార్వత్రిక రేషన్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న నయా ఉదారవాద విధానాలు
- 13.2శాతం సాకుతో ప్రజా పంపిణీ వ్యవస్థ కుదింపునకు కేంద్రం కసరత్తు
-ఈ-కేవైసీ,ఆధార్ నిబంధనలతో అర్హులైన పేదలకు ఆహార భద్రత దూరమయ్యే ప్రమాదం
నవతెలంగాణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)కింద ఉచిత రేషన్ పొందుతున్న వారిలో భారీ సంఖ్యలో అనర్హులు ఉన్నట్లు కేంద్ర ఆహార,ప్రజా పంపిణీ విభాగం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.సొంతంగా కారు,ఏసీ కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఉచిత రేషన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
2025-26ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 36రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303లబ్ధిదారుల కుటుంబాలపై కేంద్రం సమగ్ర సర్వే నిర్వహించింది.ఈ సర్వే వివరాల ప్రకారం,పట్టణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతా కుటుంబాల్లో 15.7శాతం మంది అనర్హులు ఉన్నారు.రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 39.5శాతం,త్రిపురలో 39.2శాతం,తమిళనాడులో 38.7శాతం,మేఘాలయలో 28.5శాతం మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది.ఈ గణాంకాల నేపథ్యంలో నిజమైన అర్హులకే పథక ఫలాలు అందేలా త్వరలోనే దేశవ్యాప్తంగా అనర్హుల కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)కింద సాగుతున్న ఉచిత రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ,పేద మరియు శ్రామిక వర్గాల ఆహార భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.కేంద్ర ఆహార,ప్రజా పంపిణీ శాఖ నిర్వహించిన తాజా అధ్యయనంలో 13.2శాతం మంది అనర్హులు ఉచిత రేషన్ పొందుతున్నారని పేర్కొంటూ,వారి కార్డులను రద్దు చేయడంతో పాటు ఈ-కేవైసీ (e-KYC)నిబంధనలను కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.అయితే,బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు కల్పిస్తున్న పాలకులు,సామాన్య ప్రజలకు అందించే ఆహార సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకే 'అనర్హుల ఏరివేత'అనే కొత్త నాటకానికి తెరలేపారని వామపక్ష పార్టీలు,ఆర్థిక విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.






కామెంట్లు (0)