నవతెలంగాణ - హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటును పెంచడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో రెపో రేటుతో అనుసంధానమైన గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును 0.25 శాతం పెంచిన ఆర్‌బీఐ.. 6.50 శాతానికి చేర్చింది. అనంతరం 2025లో వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియ ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, డిసెంబరులో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టు సమీక్షల్లో ఆర్‌బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అయితే పశ్చిమాసియా ఘర్షణలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాల నేపథ్యంలో తాజాగా రేటును పెంచింది.





కామెంట్‌లు (0)