నవతెలంగాణ-హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో నిరసన చేపట్టారు. రాణి రష్మోని అవెన్యూలో నిరసనకు ముందు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. బెనర్జీ, పార్టీ నాయకులు డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీలతో కలిసి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
కోల్‌కతాలో ఇటీవల బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులు తీవ్రమయ్యాయి. కేవలం ఆ పార్టీకి చెందిన వారిపైనే కాకుండా సామాన్య ప్రజలపై కూడా దాడులకు పాల్పడుతోంది. ఇటీవల డమ్‌డమ్ రైల్వే స్టేషన్‌లో చిరు వ్యాపారుల దుకాణాల్ని సైతం అధికారులు కూల్చేశారు. అలాగే ఆదివారం రోజు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాలలో దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటన బాధితులైన వారిని కలిసేందుకు వెళ్లిన అభిషేక్‌పై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఇటీవల టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీపై చండితాలా పోలీస్ స్టేషన్ సమీపంలో హత్యాయత్నం జరిగింది. ఈ దాడులకు వ్యతిరేకంగా టిఎంసి అధినేత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చారు.


