Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలులష్కర్ బోనాలు ప్రారంభం.. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

లష్కర్ బోనాలు ప్రారంభం.. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో ప్రసిద్ధి చెందిన లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఇవాళ‌ తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ భక్తుల కోసం మూడు, బోనాలు సమర్పించే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం మరో క్యూలైన్ సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలను కేటాయించగా, సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

లష్కర్ బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం వరకు ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. జాతర ముగిసే వరకు పొగాకుబజార్, సుభాష్ రోడ్, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే దారులను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కర్బాలా క్రాస్‌రోడ్స్ వద్ద వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ నుంచి మినిస్టర్ రోడ్డు, గోపాలపురం లైన్ మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -