నవతెలంగాణ – అశ్వారావుపేట
సాగు తరుణం ఆసన్నం అయింది.ఏ పంట సాగు చేసే రైతులు ఆ పంటకు సరిపడా విత్తనాలు,దుక్కి,కూలీ సంబంధ వనరులను సమకూర్చుకుంటున్నారు. అశ్వారావుపేట నియోజక వర్గంలో నూ అంతర్జాతీయ వ్యాపారం పంట, తెల్ల బంగారం లా పిలువబడే ప్రత్తి సైతం సాగు చేస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రతి సాగులో వానాకాలం యాజమాన్యం పై అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి.రవికుమార్ రైతులకు అందించే సూచనలు సలహాలు.
మిగతా అన్ని పంటలు వలే ప్రత్తి కి 18 రకాల పోషకాలు ప్రధానంగా అవసరం ఉంటాయి. వీటిలో కర్బనం,హైడ్రోజన్,ఆక్సిజన్ గాలి నీటి ద్వారా లభించగా, మిగిలిన పోషకాలైన నత్రజని, భాస్వరం,పొటాషియం, కాల్షియం,మెగ్నీషియం, గంధకం,మాంగనీస్,జింకు మొదలైనవి సేంద్రియ,రసాయనిక ఎరువుల ద్వారా మొక్కలకు అందజేయాలి. ప్రత్తి పంటకు ఎకరాకు కనీసం 4 టన్నుల పశువుల ఎరువు వేయాలి.సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల లో మొత్తం భాస్వరం ఎరువును విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేయాలి.నత్రజని మరియు పోటాష్ ఎరువులను దుక్కిలో నూ, పై పాటుగా మూడు దఫాలుగా వేయాలి.
నత్రజని ఎరువులను సిఫారసు మించి వేస్తే,రొట్ట ఎక్కువగా పెరిగి పంట త్వరగా పూత కాత రానీయదు. భాస్వరం ఎరువు మొక్కల వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి దోహదపడుతుంది కావున భాస్వరం ఎరువులు వాడకం దుక్కి లోనే వేయడం పూర్తిచేయాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ పంట 30 రోజులకు తర్వాత భాస్వరం కలిగిన కాంప్లెక్సు ఎరువులను వాడరాదు, దానివలన ఖర్చు పెరగడమే కాని ఫలితముండదు.
విత్తనాలు విత్తే ముందే దుక్కిలో ఎకరాకు ఒక బస్తా డీఏపీ, 20 కిలోల పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వాడాలి.పై పాటుగా వేసే నత్రజని,పొటాష్ ఎరువును వెదజల్ల కుండా, మొక్కల మొదళ్ళకు 2 నుండి 4 అంగుళాల దూరం లో గుంటలు తీసి అందే లోతులో వేయాలి.
ఈ వానాకాలంలో రుతుపవనాలు వారం రోజుల ముందే ప్రవేశించాయని రైతులు పొడి దుక్కిలో కూడా ప్రత్తి విత్తనాలు పెట్టారు. ఇప్పుడు వర్షాలు పడుతున్న తరుణంలో విత్తనాలు మొలవని చోట ఖాళీలు పూరించాలి.వీలైతే కంది విత్తనాలను ఖాళీల విత్తి తే లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ శాఖ అశ్వారావుపేట డివిజన్ లో ఈ వానాకాలంలో వర్షపాతం : ఇప్పటి వరకు 30 శాతం వర్షపాతం అధికంగా నమోదు అయింది.ములకలపల్లి మండలం లో మాత్రమే లోటు వర్షపాతం నమోదు అయింది. వర్షాధారంగా సాగు చేసే పంట అయిన పత్తి విత్తనాలు విత్తటం పూర్తి అయింది. వరిసాగు లో కొంత మంది రైతులు విత్తనాలను నేరుగా వెదజల్లే పద్ధతిలో విత్తనాలు నాటారు.
దీని వలన నెల రోజుల పాటు నారుమడి యాజమాన్య సమయం, నాటు వేసే ఖర్చు ఆదా అవుతుంది.రైతులకు సాగు వ్యయం తగ్గించడం ప్రస్తుత అవసరం.నాట్లు వేసే పద్ధతిలో వరిసాగు దమ్మపేట,అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఊపందుకుంది. వ్యవసాయ సబ్సిడీ పై అందించిన పచ్చి రొట్ట విత్తనాలు జనుము,జీలుగ సాగు చేసిన రైతులు 30 నుండి 40 రోజు వయస్సులో కలియ దున్నడం మొదలయ్యింది.పచ్చిరొట్ట పైరును కలియ దున్నే సమయంలో రెండు బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం ద్వారా అది త్వరగా కుళ్ళి పోయి నేల తో సేంద్రియ పదార్థం వృద్ధికి దోహదపడుతుంది.నాట్లు వేసే సమయంలో తప్పనిసరిగా రైతులు కాలిబాటలు వేయడం తప్పని సరిగా చేయాలి.రైతులు తెలంగాణ సోనా (ఆర్.ఎన్.ఆర్ 15048 ) వరి విత్తనాన్ని జులై 15 తర్వాత నార్లు పోయాలి.
పత్తి విత్తిన 10 రోజుల్లో మొలక రాని చోట గింజలు విత్తుకోవాలి.రెండు మొలకలు ఉన్న చోట పీకి వేసి కుదురు కు ఒక మొక్క ఉండేలా చూడాలి. పత్తిలో అంతర పంటగా కంది ని 4 లేదా 6 సాళ్ళ పత్తి కి ఒక సాలు కంది వేసుకోని మంచి దిగుబడులు వర్షాధారంగా పొందవచ్చు. 110 కిలోల యూరియా,150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డి.ఏ.పి, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.భాస్వరం ఎరువును మొత్తాన్ని దుక్కిలో లేదా విత్తిన 15 రోజుల లోపు వేసుకోవాలి. పత్తి విత్తిన 20, 40, 60, 80 రోజులలో 25 కిలోలు యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి 4 సార్లు వేయాలి.పైపాటుగా డి.ఏ.పి లేదా మరే ఇతర కాంప్లెక్సు ఎరువులను వాడకూడదు.
ఈ వానాకాలంలో ఇప్పటి వరకు పంటల సాగు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లో ప్రతి క్లస్టర్ కు 10 ఎకరాలు మునగ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించనైనది.ఆసక్తి కలిగిన రైతులు తాము వివరాలను వ్యవసాయ విస్తీర్ణం అధికారికి తెలియజేసి మునగ సాగు చేపట్టాలని విజ్ఞప్తి.