Magazines

నెలసరి సక్రమంగా లేదా..?నిక్‌

14 నిమిషాల క్రితం

Are your periods irregular?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 3 నిమిషాల చదవడం

పీరియడ్స్​ మహిళల జీవితంలో అత్యంత సాధారణమైన, సహజమైన ప్రక్రియ. స్త్రీ శారీరక ఆరోగ్యం సక్రమంగా ఉందనడానికి ప్రతి నెలా వచ్చే ఇవే నిదర్శనం. అమ్మాయి యుక్త వయసులో ప్రాంభమయిన పిరియడ్స్‌ ‌మెనోపాజ్‌ ‌వరకు కొనసాగుతాయి. అయితే కొన్ని సార్లు కొందరికి రుతుస్రావం సమయానికి రాకపోవడమో లేదంటే ఆగడమో జరుగుతుంటుంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీంతో కొద్దిమంది ఏమో ప్రెగ్నెన్సీ వచ్చిందని చెక్​ చేసుకుంటుంటారు. అయితే పీరియడ్స్​ సమయానికి రాకపోవడానికి గర్భం ఒక్కటే కాకుండా వివిధ రకాల కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం...



నెలసరి ఆగిపోవడానికి గర్భధారణ అత్యంత సాధరణమైన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పటికీ కొన్నిసార్లు అవి సరిగ్గా పనిచేయకపోవచ్చని.. లైంగికంగా యాక్టివ్‌గా ఉన్న మహిళల్లో పీరియడ్స్ మిస్ అయితే, మొదట హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్షించుకోవడం మంచిదంటున్నారు. పాజిటివ్‌గా ఫలితం వస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఒత్తిడి

సుదీర్ఘకాలం పాటు సాగే మానసిక ఒత్తిడి మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా పీరియడ్స్ ఆలస్యం కావడం, కొన్నిసార్లు పూర్తిగా మిస్ అవ్వడం లేదా రుతుస్రావం సమయంలో తీవ్రమైన కడుపునొప్పి రావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగ, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇవి ఒత్తిడిని తగ్గించి నెలసరి సమయానికి రావడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

పెరిమెనోపాజ్

మెనోపాజ్​ సగటు వయసు 52 సంవత్సరాలు. ఒక వ్యక్తికి 12 నెలల పాటు పీరియడ్స్​ రానప్పుడు వారు మెనోపాజ్​కు చేరుకున్నట్లుగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇక రుతుచక్రం ఉన్న చాలా మందిలో మెనోపాజ్​కు రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల ముందు నుంచే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పెరిమెనోపాజ్​ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని.. ఫలితంగా పీరియడ్స్ ఆలస్యం కావడం లేదా క్రమం తప్పడం సహజం అంటున్నారు.

బరువు తగ్గడం

ఇటీవల కాలంలో బరువుతగ్గేందుకు చాలా మంది కఠినమైన డైటింగ్ లేదా మితిమీరిన వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వీటి వల్ల కూడా నెలసరి సమయానికి రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పై మాదిరి చేసినప్పుడు బరువు తగ్గడం సహజం అని, దీని వల్ల శరీరంలో కొవ్వు శాతం బాగా తగ్గిపోతుందని, ఫలితంగా ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయులు మారి అండం విడుదల కాదని, దీనివల్ల పీరియడ్స్ నిలిచిపోయే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అనుకున్నదాని కన్నా బరువు తగ్గినా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు నెలసరి ఆగిపోయినా వెంటనే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అధిక బరువు

బరువు తగ్గడం మాత్రమే కాదు, అధిక బరువు కూడా రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు కూడా హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడి నెలసరి సైకిల్ దెబ్బతింటుంది. అలాగే ఊబకాయం, నెలసరి తప్పడం వంటివి కొన్నిసార్లు పాలిఎండోక్రైన్​ మెటబాలిక్​ ఓవేరియన్​ సిండ్రోమ్​ వంటి వైద్యపరమైన సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు. కాబట్టి బరువు ఎక్కువ ఉండి, నెలసరి ఆలస్యంగా వస్తున్న వారు గైనకాలజిస్ట్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

బర్త్​ కంట్రోల్​ పద్ధతులు

కొన్ని రకాల గర్భనిరోధక పద్ధతులు నెలసరి తప్పిపోవడానికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్స్, ప్యాచులు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్ల వల్ల గర్భాశయ లోపలి పొర చాలా పల్చగా మారుతుందని.. దీనివల్ల పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అవ్వడానికి తగినంత పొర లేక పీరియడ్స్ రావంటున్నారు. సాధారణంగా దీనివల్ల ప్రమాదం లేకపోయినప్పటికీ, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

హార్మోన్ల అసమతుల్యత

ప్రొలాక్టిన్​ లేదా థైరాయిడ్​ వంటి హార్మోన్లలో అంతరాయాల వల్ల కూడా నెలసరి ఆగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రుతుస్రావంలో థైరాయిడ్​ హార్మోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు. అలాగే పిట్యూటరీ గ్రంథి వల్ల ప్రోలాక్టిన్​ హార్మోన్​ పెరిగితే పీరియడ్స్​ ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు. అందుకే బ్లడ్ టెస్టుల ద్వారా ఈ హార్మోన్ల లోపాలను గుర్తించి, మందుల ద్వారా వీటిని సరిచేస్తారని చెబుతున్నారు.

పీఎంఓఎస్‌

ప్రస్తుత కాలంలో రీప్రొడక్టివ్ వయసులో ఉన్న మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న సమస్య పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PMOS). దీనివల్ల అండాశయాలలో చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. ఫలితంగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు రాలడం, హఠాత్తుగా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి

ఒకటి లేదా రెండు సార్లు పీరియడ్స్ మిస్​ అవ్వడం సాధారమని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని లక్షణాలకు కనిపించినప్పుడు మాత్రం అప్రమత్తమయ్యి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.​ అవేంటంటే.. వరుసగా మూడు నెలలకు మించి పీరియడ్స్​ రాకపోయినా, అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం లాంటివి జరిగినా, పీరియడ్స్ మిస్ అవ్వడంతో పాటు అవాంఛిత రోమాలు, తీవ్రమైన మొటిమలు రావడం వంటివి జరిగితే మాత్రం వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్