Magazines

విరిగిన రెక్కలతో ఆమె ప్రయాణం‌

1 గంట క్రితం

broken wings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 5 నిమిషాల చదవడం

సుమిత్రా మెహ్రోల్... రచయిత్రి, దళిత హక్కుల కార్యకర్త. స్త్రీవాదం, దళిత అస్తిత్వం, వికలాంగుల హక్కుల కనోసం ఆమె చేసిన రచనలు సమాజంలో ఎంతో గుర్తింపు పొందాయి. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన ఆమె వికలాంగురాలిగా, ఓ దళిత మహిళగా సమాజంలో అనేక వివక్షలను, సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఉన్నత చదువులు చదివి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్యామ్ లాల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు ఒంటరిగా ఆమె చేసిన పోరాటం నేడు ఆమెను ఓ శక్తిమంతమైన మహిళగా నెలబెట్టింది. ‘ఎ ఫ్లైట్ ఆన్ బ్రోకెన్ వింగ్స్: ఏన్ఆటోబయో గ్రఫీ’ అనే పుస్తకంలో తన జీవిత అనుభవాలను రచించారు. స్ఫూర్తిదాయకమైన అందులోని ఓ భాగాన్ని ఈరోజు మనవిలో మనం చదువుదాం...


శ్రీనివాస్‌పురిలోని మా ఇంటి పక్కనే గోయల్ అనే కుటుంబం ఉండేది. వారి అమ్మాయి సీమ నా వయసే. వారి కొడుకు మా అన్న వయసు. వాళ్ల అమ్మ తరచుగా మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మ, ఆమె గంటల తరబడి మాట్లాడుకునేవారు. నేను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ల ఇంటికి ప్రతి నెలా చంపక్, చం మామ, నందన్ వంటి అనేక పిల్లల పత్రికలు వచ్చేవి. వాటిని నేనెంతో ఇష్టంగా చదివేదాన్ని. వాటిని చదవాలనే ఆత్రుత ఎంతగా ఉండేదంటే, ప్రతి నెలా అవి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసేదాన్ని. ఆ ఇంట్లోని పిల్లల కంటే ముందే నేను వాటిని చదివేసేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తే నాలో సాహిత్యాభిలాష అనే బీజం అప్పుడే పడిందేమో అనిపిస్తుంది. నాకు ఇంకా చదవాలనిపించేది. కానీ మా ఇంట్లో వారికి పుస్తకాలపై ఆసక్తి లేదు. కథలు చదివితే పిల్లలు చెడిపోతారని, దారి తప్పిపోతారని మా కుటుంబం నమ్మేది. అందుకే సాయంత్రాలలో మేమంతా దగ్గర్లోని కమ్యూనిటీ సెంటర్‌కు వెళ్ళేవాళ్ళం. అందులో ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీకి చెందిన ఒక చిన్న శాఖ ఉండేది.

మా పక్కవాళ్లు సుష్మ, సవిత అక్కడి నుండి పుస్తకాలు తీసుకుని ఇంటికి తెచ్చేవారు. నేను వాటిని అరువు తీసుకుని రహస్యంగా చదవడం మొదలుపెట్టాను. కానీ సుష్మ, సవిత లైబ్రరీలో పిర్యాదు చేయడంతో అది అక్కడితే ఆగిపోయింది. దాంతో లైబ్రరీలో సభ్యురాలిగా చేరాలని నిర్ణయించుకున్నాను. ఒక ఫారం తీసుకున్నాను. ఆ రోజుల్లో, ఒక దరఖాస్తు ఫారంపై స్థానిక అధికారి సంతకం చేయకుండా దాన్ని అంగీకరించేవారు కాదు. మా అమ్మానాన్నలను సహాయం అడగకుండా, నేనే స్వయంగా ఆ అధికారి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు నేను చదవడాన్ని వ్యతిరేకిస్తారు. ఆ రోజుల్లో చలి ఎక్కువ. శబ్దానికి నేను దొరికిపోతానేమోనని భయపడి బూట్లు కూడా వేసుకునేదాన్ని కాదు. పల్చటి, పాత చెప్పులతోనే ఇంట్లోంచి దొంగచాటుగా బయటకు వచ్చాను. చలికి వణుకుతూ ఆ ఫారమ్‌ను గట్టిగా పట్టుకుని, అతన్ని కలవడానికి వేచి ఉన్న ప్రముఖుల పొడవైన క్యూలో చేరాను.


ఎన్ని సార్లు వెళ్ళినా అతన్ని కలవలేకపోయాను. సాయం చేసే వాళ్లు అక్కడ ఎవరూ లేరు. అయినా వదులుకోవడానికి ఇష్టపడలేదు. మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాను. బహుశా ఆ అధికారి మదిలో నేను నాటుకుపోయి ఉండాలి. ఒకరోజు అతను నన్ను లోపలికి పిలిచాడు. అతను నాతో చాలా మర్యాదగా ఏం కావాలో అడిగాడు. నేను ఫారమ్‌ అందించాను, అతను దానిపై సంతకం చేశాడు! ఇప్పుడు నేను గ్రంథాలయం నుండి పుస్తకాలు తీసుకోవచ్చు. అంతే పంచతంత్రం, రాజకీయాల గురించిన పుస్తకాలు, జానపద కథలు, అన్నీ, నేను అవన్నీ చదివాను. కొంతకాలం తర్వాత మేము మదన్‌గీర్‌కు మారాము. దగ్గరలో గ్రంథాలయం లేదు. పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లటానికి అనుమతి లేదు. ఆ రోజుల్లో గుల్షన్ నంద, ప్రేమ్ వాజ్‌పేయి వంటి ప్రముఖ రచయితల పుస్తకాలు రోజుకు 50 పైసలకే అద్దెకు దొరికేవి. వేరే ఏమీ దొరక్క పుస్తకాలపై నాకున్న దాహాన్ని వీటిని చదవడం ద్వారా తీర్చుకునేదాన్ని. ఇది మా అన్నయ్యలకు అస్సలు నచ్చేది కాదు. నా చేతుల్లోంచి పుస్తకాలు లాక్కుని చింపేసేవారు. ఆ నష్టానికి పరిహారంగా నా జేబు ఖర్చులోంచి చిల్లర పైసలు ఎలాగోలా పొదుపు చేయాల్సి వచ్చేది.

మేము ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికల వంటివి ఎవరి దగ్గర ఉన్నా అయస్కాంతంలా వాటికి అతుక్కుపోయేదాన్ని. ఇలా నా చేతికి అందిన ప్రతీదాన్ని చదివేశాను. వేసవి రోజుల్లో దాదీని చూడటానికి ఆగ్రా వెళ్ళేవాళ్ళం. అక్కడ చిన్నపిల్లల పాఠ్యపుస్తకాలు చదివేదాన్ని. చివరికి వంటల పుస్తకాలను కూడా ఆబగా చదివేసేదాన్ని. మనుషులలో కనుగొనలేని ప్రతిదీ.. ధైర్యం, మార్గనిర్దేశం, పనిచేయడానికి ప్రేరణ నాకు పుస్తకాల్లో దొరికాయి. అవే నా స్నేహితులయ్యాయి. క్రమంగా పుస్తకాల వల్ల నా ఆత్మవిశ్వాసం పెరిగింది. చదువుపై దృష్టి పెట్టాను. పాఠశాలలో నా ప్రతిభ మెరుగుపడింది. ప్రజలు ఇప్పుడు నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. నేను ఆడపిల్లని, అందునా వికలాంగురాలిని అందుకే నా భారం మొత్తం నా తల్లిదండ్రులే చూసుకునేవారు. నా అన్నదమ్ములు నన్ను పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా నేను ఒంటరిగానే వెళ్లేదాన్ని. అది బడికైనా, సంతకైనా, లేదా మరెక్కడికైనా సరే, నాతో పాటు రావడానికి ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను చదువుకున్న పబ్లిక్ స్కూల్లో పాటల పోటీలలో పాల్గొన్నాను. కానీ ప్రభుత్వ పాఠశాలలో నాకు అలాంటి అవకాశం రాలేదు.

నా చుట్టూ ఎంతో మంది ఆరోగ్యంగా, దృఢంగా, సమర్థులుగా ఉన్నప్పుడు, నన్ను వేదికపైకి ఎక్కించి ఎవరైనా ఎందుకు సాహసం చేస్తారు? ఆ సమయంలో, నాకు కావలసిన దాని కోసం అందరితో పోరాడే సంకల్ప శక్తిని నేను ఇంకా పెంపొం దించుకోవాల్సి ఉంది! ఇంట్లో మా అమ్మ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండేది. నేను ఆమె నుండి కూడా నేర్చుకున్నాను. అయితే వారు నన్ను ఒక సాధారణ వ్యక్తిలా పెంచారు. వికలాంగ పిల్లలకు ప్రత్యేక అవసరాలు ఉంటాయని, వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని వారు ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది మంచికో చెడుకో తెలియదుకానీ దీనివల్ల నన్ను నేను చూసుకోవడానికి, నా జీవిత మార్గాన్ని ఎంచుకోవడానికి, నన్ను నేను నిలబెట్టుకోవడానికి పూర్తిగా ఒంటరిగా వదిలివేయబడ్డాను. కొన్నిసార్లు నా వైకల్యం పట్ల సానుభూతి, కరుణ లేదా అవగాహనతో కూడిన ఒక్క మాట కోసం తపించేదాన్ని. కానీ వారి నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. వారికి అలాంటి వాటితో పనిలేదు. దాంతో నేను చిన్న వయసులోనే నా కాళ్ళ మీద నేను నిలబడటం, ఇతరులపై ఆధారపడకుండా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి అడుగులోనూ నాకు సహాయం అంది ఉంటే బహుశా ఇప్పుడు ఉన్నంత బలంగా ఉండటం ఎప్పటికీ నేర్చుకోలేకపోయేదాన్ని. మా అమ్మ చాలా కఠినమైన క్రమశిక్షణాధికారి. మమ్మల్ని అలానే పెంచారు.


నేను చాలా పిరికిదాన్ని, నాకు కావాల్సింది నిలబెట్టుకునే ధైర్యం నాకు ఉండేది కాదు. మాలో ఎవరైనా ఏడ్చినా, తినడానికి నిరాకరించినా, అమ్మ మరింత కఠినంగా ఉండేది. వాస్తవానికి తల్లిదండ్రులు తమ పిల్లలు వ్యక్తపరిచే ప్రతి కోరికకు లొంగిపోవడం సాధ్యం కాదు. కానీ వారు తమ పరిసరాలను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ప్రవర్తించడం, అప్పుడప్పుడు తమ పిల్లల పట్ల కాస్త ఉదారంగా ఉండటం కూడా ముఖ్యం. నేను ఏడిస్తే అమ్మకు అస్సలు నచ్చేది కాదు. ఆమే కాదు, నా సోదరులు కూడా నన్ను తిట్టేవారు. నేను ఏడుస్తుంటే ఎగతాళి చేసేవారు. అది నన్ను చాలా బాధపెట్టేది. నేను అమ్మాయిని కాబట్టి ఆంక్షలు కూడా విధించేవారు. పిల్లల హృదయంలో ఏం జరుగుతుందో, పిల్లల అవసరాలు, కోరికలు ఏమిటో, దీని గురించి మా తల్లిదండ్రులకు కనీస అవగాహన లేదు. బహుశా వారి దృక్కోణం నుండి చూస్తే వారు కూడా తమ నియంత్రణలో లేని ఒక పరిస్థితిలో చిక్కుకున్నారని నేను అనుకుంటున్నాను. వారి ఎంపికలు, వారి బలం రెండూ పరిమితంగా ఉన్నాయి. మా నాన్న సంపాదించే కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబ బాధ్యత అంతా మోయాల్సి వచ్చేది.


ఇక అమ్మ విషయానికొస్తే వంట చేయడం, శుభ్రం చేయడం, తుడుచుకోవడం, బట్టలు ఉతకడం, కుటుంబాన్ని చూసుకోవడం వంటి ఇంటి పనుల్లో పూర్తిగా మునిగిపోయేది. నేను సహాయం చేయడానికి ప్రయత్నించినా చేయగలిగింది చాలా తక్కువ. అయితే మా కుటుంబం గురించి నేను ఎంతగానో మెచ్చుకునే ఒక విషయం ఉంది. వాళ్ళు నన్ను ఏ పనీ చేయకుండా ఎప్పుడూ ఆపలేదు. నా లింగం వల్లనో, నా వైకల్యం వల్లనో కాదు. వాళ్ళు నాకు మద్దతు ఇవ్వకపోయినా, నా దారిలో అడ్డంకులు కూడా పెట్టలేదు. నా మార్గాన్ని ఎంచుకుని, దానిపై నడిచే స్వేచ్ఛ నాకు ఉండేది. ఏడేండ్ల వయసులో, లైబ్రరీ ఫారం కోసం అధికారి కార్యాలయానికి వెళ్ళే పనిని నేను చేపట్టినప్పుడు వాళ్ళు నన్ను ఆపలేదు. చిన్నప్పుడు నేను దగ్గర్లోని పార్కుల్లోనూ, అక్కడక్కడా ఉన్న ఉయ్యాలల్లోనూ గంటల తరబడి ఆడుకునేదాన్ని. కానీ నేను ఎక్కడున్నానో అని అడగడానికి గానీ, పట్టించుకోవడానికి గానీ వాళ్ళు ఎప్పుడూ రాలేదు. నన్ను చాలా వరకు నా ఇష్టానికే వదిలేశారు. 11 ఏండ్ల వయసులో నేను డీటీసీ బస్సుల్లో ప్రయాణించడం మొదలుపెట్టాను. బడి నుండి ఇంటికి వెళ్ళడానికి వాటిని ఉపయోగించేదాన్ని. అప్పటి నుండి నేను పెద్దయ్యాక కూడా మా తల్లిదండ్రులు నా భద్రత గురించి ఆందోళన చెందలేదు. నన్ను నా ఇష్టానికి వదిలేశారు.


- సలీమ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్