అబ్రహం లింకన్ నౌకపై ఇరాన్ క్షిపణుల దాడి
మొన్న యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్..ఇపుడు కీలక నావికాదళమైన అబ్రహం లింకన్‌పై గురి
ఇరాన్‌కు ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదనలు పంపిన ట్రంప్ ప్రభుత్వం
అదే సమయంలో పశ్చిమాసియాకు భారీగా సేనల తరలింపు
మేమే గెలిచామంటూ ట్రంప్ బీరాలు…ఉత్తిదేనన్న టెహ్రాన్
పశ్చాత్తాపం చెందే వరకూ దాడులు కొనసాగిస్తాం : అరాగ్చీ
దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న మధ్యప్రాచ్యం
సడలని ఉద్రిక్తత
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. అప్పటి నుంచి నేటి వరకు విరామం లేకుండా అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. దీంతో ఇరాన్ కూడా రౌద్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే బుధవారం అమెరికా విమానవాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ విరుచు కుపడింది. తాము క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసినప్పటికీ, అమెరికా అధికారులు దీనిపై ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. ఇరాన్ సైనిక ప్రజా సంబంధాల విభాగం ప్రకారం, క్రూయిజ్ క్షిపణులను అమెరికా విమానవాహక నౌక దిశగా ప్రయోగించారు.
యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ తమ నిశిత నిఘాలో ఉందని, అది ఇరాన్ భూభాగానికి సమీపిస్తే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నౌకాదళం ఇటీవల అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరిక జారీ చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా విమానవాహక నౌక ఇరాన్ క్షిపణి పరిధిలోకి వస్తే, ఇరాన్ నౌకాదళం దానిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ హెచ్చరించారు. ఆ నౌకను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ సేనకు ఇరాన్ హెచ్చరికలు చేసిన గంటలోపే గురిపెట్టి..క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ఉన్నత సైనిక అధికారులు అమెరికా ప్రభావాన్ని కూడా తోసిపుచ్చారు. ప్రెస్ టీవీ కథనం ప్రకారం, ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఖారీ మాట్లాడుతూ, అమెరికా యొక్క వ్యూహాత్మక బలం అని పిలవబడేది ఇప్పుడు వ్యూహాత్మక ఓటమిగా మారిందని అన్నారు.
అమెరికా వైఖరిలో మార్పుపై జోల్ఫఖారీ వ్యాఖ్యలు
ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న ట్రంప్.. ఆ తర్వాత ఆ హెచ్చరికను సడలించిన సమయంలో ఈ ప్రకటన లు వెలువడ్డాయి. ఈ ప్రాంతంలోని ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా ప్రతీకారం తీర్చు కుంటామని ఇరాన్ హెచ్చరించిన తర్వాత ఈ మార్పు వచ్చిందని సమాచారం. అమెరికా వైఖరిలో ఈ మార్పుపై స్పందిస్తూ, జోల్ఫఖారీ ఇలా అన్నారు. ‘ప్రపంచాన్ని అగ్రరాజ్యంగా చెప్పుకునే దేశం ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగితే, ఇప్పటికే బయటపడి ఉండేది. మీ ఓటమిని రాజీ అని పిలవకండి’ అని చమత్కరించారు. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా ఆయన విమర్శిస్తూ, ”సంఘర్షణ స్థాయి ఎంతగా పెరిగిపోయిందంటే, మీలో మీరే చర్చలు జరుపుకుం టున్నారా?” అని ప్రశ్నించారు.
ఈ ప్రాంతంలో అమెరికా గతంలో పెట్టిన పెట్టుబడులు, ఇంధన ధరలు తిరిగి రావని, ప్రాంతీయ స్థిరత్వం ఇప్పుడు ఇరాన్ సైనిక బలంపైనే ఆధారపడి ఉందని కూడా జోల్ఫఖారీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం మా సాయుధ దళాల బలమైన హస్తంతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొంటూ, ఈ పరిస్థితిని ”బలం ద్వారా స్థిరత్వం”గా అభివర్ణించారు. ఇరాన్‌పై సైనిక చర్య అనే ఆలోచనను పూర్తిగా తొలగించే వరకు ఈ పరిస్థితి తిరిగి రాదని ఆయన ఇంకా స్పష్టం చేశారు. ”మొదటి రోజు నుంచీ మా సందేశం ఒకటే, ఇకపైనా అదే కొనసాగుతుంది. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళతో రాజీపడరు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ. ” అని చెబుతూ ఆయన ముగించారు.
పశ్చాత్తాపం చెందే వరకూ ప్రతీకార దాడులు కొనసాగుతాయి : అరాగ్చీ
తాజాగా ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. మరోవైపు అమెరికా సైన్యం పశ్చిమాసియాకు వేలాది మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో యాభై వేల మంది సైనికులు మకాం వేశారు. మరోపక్క యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ట్రంప్ చెప్పుకుంటుంటే ఇరాన్ మాత్రం అలాంటిదేమీలేదని తోసిపుచ్చింది. దురాక్రమణకు పాల్పడిన అమె రికా, ఇజ్రాయిల్ దేశాలు తాము చేసిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందే వరకూ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. తాజా పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో చర్చించిన అనంతరం అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారని స్థానిక మీడియా తెలిపింది.
ఇరాన్ జనావాసాలు, రక్షణ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులే పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతున్నాయని అరాగ్చీ ఆరోపించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని మూసివేయడం సహా తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికాతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చర్చలు జరగడంలేదని పాకిస్తాన్‌లో ఇరాన్ రాయబారి రెజా అమిరి మొఘదమ్ తేల్చిచెప్పారు. అయితే కొన్ని మిత్రదేశాలు ఇరుపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఆయన తెలిపారు.
కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి… ఆయుధ ట్యాంకర్‌ను పేల్చేసిన డ్రోన్
గల్ఫ్ దేశాలపై ఇరాన్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమా నాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేసింది. ఓ ఇంధన ట్యాంకర్‌ను డ్రోన్ ఢీకొనడంతో అది పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో విమానాశ్రయంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, స్వల్పంగా నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా ఇరాన్ వైపునుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ సైనికులు చెప్పారు.
ఆ ప్రయత్నంలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని వివరించారు. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణి శకలం కిందపడడంతో విద్యుత్ లైన్లు దెబ్బతిని అనేక గంటలపాటు సరఫరా నిలిచిపోయింది. బహ్రెయిన్ పైనా క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగాయి. నగరమంతటా సైరన్లు మోగించారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని యూఏఈ తెలిపింది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ నుంచి సుమారు 20 డ్రోన్లు దూసుకొచ్చాయని సౌదీ అరేబియా చెప్పింది.
బాంబుల మోతలతో దద్దరిల్లుతోన్న పశ్చిమాసియా.. టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడి
గల్ఫ్‌తో పాటు ఇజ్రాయిల్‌పై కూడా ఇరాన్ పెద్ద ఎత్తున దాడికి దిగింది. బాంబుల మోతలతో పశ్చిమాసియా దద్దరిల్లి పోతోంది. ఇరాన్ సేనలు వంద కిలోల వార్‌హెడ్‌తో కూడిన క్షిపణితో టెల్ అవీవ్‌పై దాడి చేశాయి. ఆ క్షిపణి టెల్ అవీవ్ సిటీ సెంటర్‌లో పడడంతో పరిసరాలలోని జనావాసాలు దెబ్బతిన్నాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాలలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. టెల్ అవీవ్ లోని ఇజ్రాయిల్ గూఢచార కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)తెలిపింది.
ఉత్తర ఇజ్రాయిల్‌పై జరిగిన దాడి లో 30 ఏండ్ల మహిళ చనిపోయింది. ఇరాన్‌కు చెందిన బాలిస్టిక్ క్షిపణి తమ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేసిందని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రా యిల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ తెలిపింది. కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే ఇరాన్ నాలుగు క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయిల్ సైనిక రేడియో తెలియజేసింది. గత 24 గంటల కాలంలో ఇరాన్ జరిపిన దాడులలో గాయపడిన 204 మందికి ఆస్పత్రులలో చికిత్స చేయిస్తున్నామని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వారిద్దరూ కలిసే పనిచేస్తున్నారు : ఇజ్రాయిల్
ఇరాన్‌తో చర్చలుజరిపే విషయంలో ట్రంప్, ఇజ్రా యిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి నిర్ బర్కత్ ఓ ప్రకటన చేశారు. ఇరువురు నేతలు కలిసే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీ క్షించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసినప్పుడే ఆ దేశంతో ఒప్పందం కుదురుతుందని తెలిపారు.
అమెరికా-ఇజ్రాయిల్‌లదే పైచేయిగా ఉండేలా ఒప్పందం కుదరాలన్నారు. ఒకవైపు ఇరాన్‌తో చర్చలు జరుపుతూనే మరోవైపు గల్ఫ్‌కు ట్రంప్ దళాలను పంపుతున్నారని గుర్తుచేశారు. కాగా ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఆ దేశంలో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేస్తున్న డానీ దానన్ చెప్పారు. ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన అన్నారు. అమెరికా ప్రారంభించిన కాల్పుల విరమణ చర్చల గురించి తమ కేమీ తెలియదని ఆయన తెలిపారు.
ఫ్లాష్..ఫ్లాష్
అమెరికాకు చెందిన ఎఫ్-18 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ డిమాండ్లు నెరవేరినప్పుడు, తాము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేసింది. అప్పటివరకు భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని తెలిపింది.
అమెరికాకు దెబ్బమీద దెబ్బ..
అమెరికా ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. సామ,దాన, బేధ,దండోపాయాలన్నింటిని ప్రయోగిస్తున్న ట్రంప్‌నకు బూమ్‌రాంగ్ అవుతున్నాయి. ఇటీవల నౌకాదళం యొక్క అత్యంత అధునాతన మరియు ఖరీదైన విమాన వాహక నౌక అయిన యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్‌పై ఇరాన్ దాడిచేసింది. దాని కేంద్ర లాండ్రీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా క్రీట్‌లో లంగరు వేసింది. ఈ అగ్నిప్రమాదం వల్ల సుమారు 600 మంది నావికులు బల్లలు, నేలపై నిద్రపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన, కంటికి కనిపించే అగ్నిప్రమాదానికి మించి లోతైన వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతోందని, నౌక యొక్క యుద్ధ సంసిద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఎర్ర సముద్రంలో ఇరాన్‌పై వైమానిక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన ఫోర్డ్, తిరిగి ఆ యుద్ధరంగంలోకి వచ్చే సీన్ లేకుండా పోయింది. ఇప్పటికే దిక్కుతోచని విధంగా ఉన్న అమెరికాకు, తాజాపై మరో కీలక వార్‌షిప్ అయిన అబ్రహం లింకన్ నౌకపై కూడా ఇరాన్ గురి చూసి కొట్టడంతో దిమ్మతిరుగుతోంది. దీంతో అమెరికా నౌకాదళ బలగాలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎఫ్-35 విమానంతో సహా పలువురు సైనికులు చనిపోతున్నా.. మొండిగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచమే కాదు. స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదనలో షరతులివే
పాకిస్తాన్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు పదిహేను సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలను అమెరికా పంపిందని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు పాక్ ముందుకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ఓ వైపు కాల్పుల విరమణ ప్రతిపాదన చేస్తూనే మరోవైపు పశ్చిమాసియాకు నౌకాదళ సిబ్బందిని, సైనికులను పంపుతుండడం గమనార్హం. అమెరికా ముందుకు తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇజ్రాయిల్ విముఖత ప్రదర్శించిందని వార్తలు వచ్చాయి. ఇంతకీ ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనలలో ఏముందంటే… ఇరాన్ తన అణు కార్యక్రమాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలి. ఇకపై అణ్వాయుధాలను తయారు చేయబోనని హామీ ఇవ్వాలి.
నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో నగరాల్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేయాలి. తన భూభాగంలో యురేనియం శుద్ధిని అనుమతించకూడదు. ఇరాన్ వద్ద ఉన్న 450కిలోల యురేనియం నిల్వల్లో 60శాతాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఆర్‌ఈఏ) కు అప్పగించాలి. ఇరాన్‌లో తనిఖీలకు ఆ సంస్థను అనుమతించడంలో పారదర్శకత ప్రదర్శించాలి. ఉగ్రవాద గ్రూపులకు ఇస్తున్న మద్దతును నిలిపివేయాలి. హార్ముజ్ జలసంధిని తెరిచి ప్రపంచ దేశాల చమురు నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా వీలు కల్పించాలి. క్షిపణి వ్యవస్థ పరిధిని, పరిమాణాన్ని కుదించుకోవాలి. భవిష్యత్తులో కేవలం ఆత్మరక్షణకు మాత్రమే క్షిపణులను వినియోగించాలి.
మేమే గెలిచాం : ట్రంప్…. తోసిపుచ్చిన ఇరాన్
ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. సైనికపరంగా ఆదేశాన్ని పూర్తిగా నాశనం చేశామని ఆయన తెలిపారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదన్న తమ షరతుకు ఇరాన్ అంగీకరించిందని కూడా అన్నారు. ‘అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ తహతహలాడుతోంది. దాని నౌకాదళం, వైమానికదళం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు విఫలమైతే ఇరాన్‌ను ఏమైనా చేయగలం’ అని తెలిపారు. హార్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికాకు ఇరాన్ ఓ పెద్ద బహుమతి ఇచ్చిందని, అది చాలా విలువైనదని చెప్పారు. అయితే ఆ బహుమతి ఏంటో ఆయన వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికాతో ఇప్పటివరకూ ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగశాఖ తేల్చి చెప్పింది.
ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలే లక్ష్యంగా…
ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌లోని ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై వరుస దాడులు జరిపాయి. టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు జరిగింది. నగరం మధ్యలో మరో పేలుడు శబ్దం వినిపించింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్, గ్యాస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. బీరుట్ ఉత్తర ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంటుపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ప్రాంతంపై జరిగిన దాడిలో మరో ఐదుగురు చనిపోయారు. కాగా ఇరాక్‌లోని అన్బర్ రాష్ట్రంలో ఇరాన్ అనుకూల పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్)ను లక్ష్యంగా చేసుకొని జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు సైనికులు చనిపోగా 13 మంది గాయపడ్డారు. ఇరాన్‌లోని అల్బోర్జ్ రాష్ట్రంలో ఉన్న కమల్‌షహర్, కరజ్ నగరాలలో జనావాసాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడులలో కనీసం 18 మంది గాయపడ్డారు.



