కోశాధికారిగా రఘురాం భట్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లుగా ఇద్దరు మాజీ క్రికెటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ అధ్యక్షుడిగా, మాజీ స్పిన్నర్ రఘురాం భట్ కోశాధికారిగా రానున్నారు. బీసీసీఐ ఈ నెల 28న ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం)లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది. కొంత కాలంగా బీసీసీఐ ఆఫీస్ బేరర్ల పదవులు ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగీవ్రం అవుతున్నాయ. ఈ సారి సైతం అదే సంప్రదాయం కొనసాగనుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కీలక సమావేశంలో ఆఫీస్ బేరర్లుగా ఎవరు నామినేషన్ వేయాలనే అంశంపై చర్చించారు.
ఐసీసీ చైర్మెన్ జై షా సహా దేవాజిత్ సైకియా, రాజీవ్ శుక్లా, అరుణ్ కుమార్ ధుమాల్, రోహన్ జైట్లీ, నిరంజన్ షాలు ఈ భేటీకి హాజరయ్యారు. అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా రఘురాం, సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ భాటియా, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా జైదేవ్ నిరంజన్ షా నామినేషన్లు దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఒక్కో పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన మిథున్.. జమ్ము కశ్మీర్‌లో జన్మించినా ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. బీసీసీఐ 2021లో నియమించిన జమ్ము కశ్మీర్ క్రికెట్ సంఘం అడ్‌హాక్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు.