టీనేజ్ అనేది చదువు, స్నేహితులతో సరదాగా గడిచిపోతుంది. ఇక ఇరవైల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకపక్క ఉన్నత చదువులు చదువుతూనే మరోపక్క కెరీర్‌పై దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరికీ ఈ సమయం ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సమయంలోనే భవిష్యత్తుకు అడుగులు పడతాయి. అలాగే ఎక్కువ తప్పులు ఈ వయసులోనే చేసే అవకాశం ఉంది. అయితే చదువైపోయి జాబ్ ఎంచుకునేటప్పుడు, ఆ తర్వాత కెరీర్‌లోనూ చేసే కొన్ని తప్పులు దీర్ఘకాలంలో కష్టాలను తెచ్చిపెడుతుంటాయంటున్నారు నిపుణులు. వాటిని నియంత్రించుకుంటూ భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
నైపుణ్యాలున్నాయా: చాలా మంది చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్‌ను ఎంచుకునే సమయంలో తమ ఆసక్తి, సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు నిపుణులు. నచ్చిన కెరీర్ ఎంచుకోవడంలో తప్పేంటి అని అనుకుంటారా? ఆసక్తి ఉన్న పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు కానీ కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు మాత్రం ఏ పని బాగా చేయగలుగుతారో, ఎందులో ఎక్కువ నైపుణ్యం ఉందో ఆలోచించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నెట్‌వర్క్ కూడా ముఖ్యమే: కాలేజీలో ఉన్నప్పుడు ఉద్యోగం సంపాదించాలని చాలామంది విపరీతంగా కష్టపడుతుంటారు. సీనియర్ల, లెక్చరర్ల అభిప్రాయాలు తీసుకోవడం, నంబర్లు తీసుకోని వారితో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. కానీ జాబ్ వచ్చిన తర్వాత చాలామంది రిలాక్స్ అవుతుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. జాబ్‌లో చేరిన తర్వాత కూడా నిత్య విద్యార్థిలా ఉండాలని, కొత్త కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎంచుకున్న రంగంలో అనుభవం ఉన్నవారితో నెట్‌వర్క్ ఏర్పర్చుకోవాలంటున్నారు. దీని కోసం లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియాలను వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు. ఎంచుకున్న రంగంలో నిపుణులతో తరచూ మాట్లాడుతూ కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. మీరు ఎంచుకున్న రంగంలో వస్తున్న కొత్త కొత్త మార్పులు గురించి తెలుసుకుంటూ, సంబంధిత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
పొదుపు మంత్రం: ఇరవైల్లో ఉండే చాలా మంది తమ సంపాదనలో అధిక భాగం టూర్లు, పార్టీలు అంటూ ఎంజారు చేయడానికి ఖర్చు చేస్తుంటారు. దీంతో నెల తిరగకుండానే జీతం మొత్తం ఖాళీ అవుతుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డుని ఉపయోగించడం, అత్యవసరం వచ్చినప్పుడు ఇతరులను అడుగుతుంటారు. కాబట్టి ఈ వయసులో కచ్చితంగా పొదుపు చేయమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా ఇతరులను అడగాల్సిన పరిస్థితి రాదు. అయితే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అదే జీవితం కాదు: చాలామందికి తగిన నైపుణ్యాలున్నా కొంతకాలం తర్వాత చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వకపోవచ్చు. కానీ ఏం చేసేది లేక అందులోనే కొనసాగుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మీరు చేస్తోన్న జాబ్ నచ్చకపోతే మరో రంగాన్ని ఎంచుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. కొత్త కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి కొంత టైం పట్టినా దీర్ఘకాలంలో మంచి ఫలితం పొందవచ్చని సూచిస్తున్నారు.
కొత్తగా చేరారా..?
- Advertisement -
- Advertisement -