రవాణా శాఖ మంత్రి పొన్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
రెండో మంగళవారం ఫిర్యాదుల సమావేశాలు
ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కింది స్థాయి సిబ్బందిపై అధికారుల వేధింపు ధోరణితో కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలని మంత్రి సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో పనులు చేయించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సిబ్బంది సమస్యలను నేరుగా వినేందుకు ప్రతి నెలా రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
మే 17 లోగా వసతుల మెరుగుదల
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, మే 17వ తేదీలోగా అన్ని డిపోలు, బస్‌స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని డిపో మేనేజర్లను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనీ, సిబ్బందితో వాగ్వాదాలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 9, 2023న ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని గుర్తు చేస్తూ ప్రజా ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు.
జూన్ నెలాఖరులోగా
పెండింగ్ అంశాల పరిష్కారం: ఎండీ వై.నాగిరెడ్డి
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ జూన్ నెలాఖరులోగా బస్టాండు లలోని కమర్షియల్ షాపులకు సంబంధించిన పెండింగ్ అంశాలను, ఇతర పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో సంస్థను మరింత లాభదాయకంగా, సేవా దక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాలోమన్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సిటీఎం శ్రీదేవితో పాటు వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరితో ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



