నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈమేరకు శనివారం హంగ్‌చుంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. షరీఫ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార-ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్, ఐటీ శాఖ మంత్రి షాజా ఫాతిమా ఖవాజా, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ఉన్నారు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చలు సాగించనున్నారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా షరీఫ్.. హాంగ్‌జౌలో జెజియాంగ్ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి వాంగ్ హావోను భేటీకానున్నారు. అదే విధంగా చైనా ప్రధాన సంస్థల సీఈఓలను కూడా కలువనున్నారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్‌లతో ఉన్నత స్థాయి సమావేశాల కోసం బీజింగ్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్-చైనా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలకు పాక్ ప్రదాని హాజరకానున్నారు.



