నవతెలంగాణ – అచ్చంపేట
మూడోవ విడత పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అచ్చంపేటలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బర్కతుల్ల ఫంక్షన్ హాల్లో పంపిణీ కేంద్రం పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని ఆదేశించారు.
సకాలంలో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరేలా పర్యవేక్షణ చేయాలని, మైక్రో అబ్జర్వర్లు విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ సామాగ్రి తరలింపులో సాయుధ పోలీసులతో బందోబస్తు ఉండాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు.
త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్, రహదారుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.



