Tuesday, July 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పాండవాణి లెజెండ్‌ ‌తీజన్‌‌బాయి

పాండవాణి లెజెండ్‌ ‌తీజన్‌‌బాయి

- Advertisement -

తీజన్‌‌బాయి… పురుషులకే పరిమితమైన ‘పాండవాణి’ని ఆలపించినందుకు కుల బహిష్కరణకు గురయింది. ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. ఒకటి మాత్రం దండిగా ఉంది… ‘నేను బతకగలను. లోకం మెచ్చేలా బతకగలను’ అనే అపారమైన ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను ప్రాచీన జానపద కళారూపం పాండవాణికి లెజెండ్‌ను చేసింది. ప్రపంచమంతా తిరిగేలా చేసింది. దేశంలోని ప్రతి ఇంటికి ఆమె పరిచయమయింది. ఆమె జీవితం కేవలం కళాప్రతిభకు సంబంధించిన విశేషం మాత్రమే కాదు.. వ్యక్తిత్వ వికాస కోణంలో ఎంతోమంది నిస్సహాయులకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే కాంతిపుంజం. జానపద కళాకారిణిగానే కాక మహిళా హక్కులకై తన గొంతు విప్పిన ఆ స్వరం నేడు ఆమె మన మధ్య లేదు. కానీ ఆత్మవిశ్వాసంతో నేను సాధించగలను అని ముందుకు సాగే ప్రతి ఒక్కరిలోనూ ఆమెను మనం చూడవచ్చు.

తీజన్ బాయి ఏప్రిల్ 24, 1956న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా గనియారి గ్రామంలో ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టారు. చిన్న వయసులోనే ఆమె తన తాత బ్రిజ్‌లాల్ పార్ధి నుంచి మహాభారత కథలను వింటూ పెరిగారు. బ్రిజ్‌లాల్‌ పార్థీ మహాభారత ఘట్టాలను చెప్పే దృశ్యాలు మామూలుగా ఉండవు. ఒకే సమయంలో కర్ణుడు అవుతాడు. దుర్యోధనుడవుతాడు. మంచివాడవుతాడు. చెడ్డవాడవుతాడు. అమ్మాయి అవుతాడు. అబ్బాయి అవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ముఖమే రంగస్థలం. ఆ ముఖ రంగస్థలంలో ఎన్నో పాత్రలు వచ్చి పోతూ ఉండేవి. ఆయన సారధ్యంలోనే చిన్నారి తీజన్‌బాయికి కళలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తితోనే ‘పాండవాణి’(పాండవుల కథ చెప్పడం) కళపై మక్కువ పెంచుకుంది. తర్వాత కాలంలో మహాభారత ఇతిహాసంలోని ఘట్టాలను సంగీతపరంగా, నాటకీయంగా వివరించే పాండవాణి కళలో ఆమె అగ్రగామిగా ఎదిగారు.

​వెనక్కి తగ్గలేదు
పన్నెండేండ్లకే తీజన్‌ ‌బాయికి పెండ్లి జరిగింది. కానీ ఏడాదికే ఆ వివాహం విచ్ఛిన్నమయింది. కేవలం పదమూడేండ్ల వయసులోనే ఆమె తన మొదటి బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. సాంప్రదాయకంగా పురుషులు మాత్రమే కూర్చుని ప్రదర్శించే ‘వేదమతి’ శైలి ఉండేది. కానీ తీజన్ బాయి ఆ ఆచారాన్ని బద్దలు కొట్టి, నిలబడి అత్యంత ఉత్సాహంగా, భావావేశంతో ప్రదర్శించే ‘కపాలిక్’ శైలిని స్వీకరించగన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. చేతిలో తంబురా పట్టుకుని, ఎర్రటి చీర కట్టుకుని వేదికపై ఆమె ఇచ్చే ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. ‘నువ్వు ఆడదానివి, ఈ కళను నువ్వు ప్రదర్శించకూడదు’ అంటూ అప్పట్లో సమాజం నుండి, తన సొంత వర్గం నుంచి బహిష్కరణ లాంటి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. సొంతంగా గుడిసె వేసుకొని, వంట పాత్రలు అరువు తెచ్చుకొని ఒంటరిగా జీనవ ప్రస్థానం ప్రారంభించింది. తీజన్‌ బాయి కళాకారిణి మాత్రమే కాదు మహిళా హక్కుల కార్యకర్త కూడా.

ఐదు దశాబ్దాలకు పైగా…
ఛత్తీస్‌గడ్‌‌ గ్రామాలలో పండగల నుంచి ప్రత్యేక సందర్భాల వరకు ఏది జరిగినా తీజన్‌బాయి కార్యక్రమం ఉండాల్సిందే. అప్పటివరకు గ్రామాలకే పరిమితమైన తీజన్‌ ప్రతిభ, నాటకరంగ దిగ్గజం హబీబ్‌ తన్వీర్‌ దృష్టి సోకడంతో ఎక్కడికో వెళ్లింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం వచ్చింది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన కళా జీవితంలో సాంస్కృతిక రాయబారిగా మారిషస్‌ నుండి ఇంగ్లాండ్‌ వరకు ప్రపంచమంతా పర్యటించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ రాసిన పుస్తకం ఆధారంగా దూరదర్శన్‌ కోసం శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’లో మహాభారత ఘట్టాలను ఆమె ప్రదర్శించారు.

ది గర్ల్‌ హూ లవ్డ్‌ టు సింగ్‌
‘తీజన్‌బాయి: ది గర్ల్‌ హూ లవ్డ్‌ టు సింగ్‌’ పేరుతో తీజన్‌బాయి జీవిత చరిత్రకు పుస్తక రూపం ఇచ్చింది లావణ్య కార్తీక్‌. రకరకాల వివక్షతలు అడుగడుగునా అడ్డుపడినా తీజన్‌ తన ప్రస్థానాన్ని ఆపలేదు. కలలు, కళల తోడు వీడలేదు. ఇది కళాకారిణి జీవిత చరిత్ర మాత్రమే కాదు. వైయక్తిక అనుభవాలు, జ్ఞాపకాల సారం మాత్రమే కాదు. వ్యక్తిత్వ వికాస పుస్తకం. విప్లవ మహిళ అంతరంగ రంగస్థలాన్ని ప్రపంచానికి పరిచయం చేసే పుస్తకం.

ఆ స్వరం మూగబోయింది
​భారతీయ జానపద కళలకు ఆమె చేసిన అపారమైన కృషికిగాను భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డులతో పాటు 1995లో ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఆమెను వరించాయి. అంతర్జాతీయంగా జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఫుకుయోకా ప్రైజ్ (2018) కూడా ఆమె అందుకున్నారు. పాండవాణి కళకే పరిమితం కాకుండా, ఒక తరం యువ కళాకారులకు ఆమె స్ఫూర్తిగా నిలిచి, తన కళను భవిష్యత్తు తరాలకు అందించారు. ఇలా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన తీజన్ బాయి తన చివరి రోజుల్లో వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్, సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్), తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. చివరకు జూలై 5న గుండెపోటుతో మరణించారు. వేలాదిమందిలో స్ఫూర్తి నింపిన ఆ స్వరం మూగబోయింది. ఇప్పుడు ఆమె భౌతికంగా మనతో లేకపోవచ్చు కానీ సమాజ హితం కోసం తపిస్తున్న కళాకారులలో ఆమె జీవించే ఉంటారు.
సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -