నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్ లో పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం నాటికి వారి నిరసనలు 16వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా విద్యార్థుల ప్రతినిధులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు విడతల వారీగా చర్చలు సాగించినా పురోగతి సాధించలేదు. విద్యార్థులు తమ నిరాహార దీక్షను కొసాగిస్తామని తెలియజేసినట్లు సమాచారం. మూడు పరీక్షలను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను విద్యార్థులు తిరస్కరించారు. పరీక్ష పత్రాల లీక్ కు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, స్వతర విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేసినట్లు సమాచారం.
అయితే పలు రోజుల నుంచి నిరాహార దీక్ష చేపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంది.విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. దీక్ష చేస్తున్న మరో విద్యార్థి రాహుల్ క్రాంతిమ్ వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు.
పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ఒక ‘ఫాస్ట్-ట్రాక్ కోర్టు’ను ఏర్పాటు చేస్తామని, 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ తెలిపారు. విద్యార్థులతో సానుకూల చర్చలు జరిపామని, ఆందోళనను విరమించడంపై వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన మీడయాతో పేర్కొన్నారు.



