Thursday, March 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపెట్రో భయాలు!

పెట్రో భయాలు!

- Advertisement -

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడితో మన దేశానికి తీవ్రమైన ఇంధన సంక్షోభం తప్పదన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్‌ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమ ఆసియా అంతా యుద్ధ మేఘాలు విస్తరిస్తున్నాయి. చర్చలు జరుగుతున్న వేళ అనూహ్యంగా అమెరికా ఇరాన్‌పై చేసిన దాడి ప్రస్తుతం గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జిసిసి) దేశాలంతటా వ్యాపించింది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి బయటకు వెళ్లే ఏకైక సముద్ర మార్గమైన హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

జలసంధి నిండా వందలాది ట్యాంకర్లు నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 65 అమెరికన్‌ డాలర్లుగా ఉండగా, మంగళవారానికి పది డాలర్లపైన పెరిగింది. ఇదే పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో ధర మరింతగా పెరగడం ఖాయమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇరాన్‌కు సమీపంలోని 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో దాదాపు ఐదవ వంతు సాగుతుంది. మన దేశం రోజుకు సగటున నలభై లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటూ ఉండగా, అందులో 55 శాతం దీని ద్వారానే వస్తోంది.

ప్రతి బ్యారెల్‌ చమురు ధరలో ఒక డాలర్‌ పెరుగుదల చోటుచేసుకున్నా, భారత్‌పై సంవత్సరానికి 200 కోట్ల రూపాయల (2 బిలియన్‌ డాలర్లు) అదనపు దిగుమతి భారం పడుతుందని అంచనా! అధికారిక సమాచారం ప్రకారం 2024-25లో చమురు దిగుమతుల కోసం మన దేశం సుమారుగా 11.5 లక్షల కోట్ల రూపాయల (137 బిలియన్‌ డాలర్లు)ను ఖర్చు చేసింది. ఏకపక్షంగా యుద్ధానికి కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘ప్రస్తుతం నాలుగు నుండి ఐదు వారాలు’ కొనసాగ వచ్చని చెబుతున్నారు. ఇరాన్‌ ప్రతిఘటన తీరును గమనిస్తున్న పరిశీలకులు యుద్ధం అంతకన్నా ఎక్కువ రోజులే సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనివార్యంగా పెరిగే దిగుమతి ఖర్చుల వల్ల విదేశీ లోటు పెరిగి వాణిజ్య సమతుల్య తను దెబ్బతీస్తుందని, రూపాయిపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. బుధవారం నాడు రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశీయ ట్రేడ్‌ సూచికలు పతనోన్ముఖానే వున్నాయి. మరోవైపు మన దేశం వద్ద ఉన్న చమురు నిల్వలు మరో 40-45 రోజుల వినియోగానికి మాత్రమే సరిపోతాయంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మనకు పొరుగునే ఉన్న చైనా వద్ద దాదాపు ఆరునెలలకు సరిపడే నిల్వలు ఉండటం అక్కడి పాలకుల ముందుచూపునకు నిదర్శనం.

ఈ పరిణామాల నేపథ్యంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఒత్తిడికి లొంగి, తక్కువ ధరకు లభించే రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా నుండి రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల మేరకు వచ్చే దిగుమతులు 10 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి. అమెరికాకు ఇచ్చిన హామీ ప్రకారం రానున్న రోజుల్లో దీన్ని మరింతగా తగ్గించాల్సి ఉంది. ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేసిన దాడి, హార్ముజ్‌ జలసంధి మూసివేతతో మనదేశ ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

నలభై రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ యుద్ధ తీవ్రత కొనసాగితే పెట్రోధరలు పెరగక తప్పవన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే దాని ప్రభావంతో నిత్యావసర వస్తువులతో పాటు, అన్ని రకాల వినియోగ సరుకుల మీద ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జరిగితే, దేశ వ్యాప్తంగా సామాన్యుల కష్టాలు మరింత పెరగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన సంక్షోభాలను ఎదుర్కొనేందుకు చమురు సరఫరా వనరులను విస్తరించేందుకు కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -