Magazines

మళ్ళీ పుట్టు ఓ గురజాడ

1 గంట క్రితం

Be born again, O Gurajada.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నీ ఆశయాలను ఎప్పుడో మరిచి పోయినం సామీ!

ఒట్టిమాటలే మిగిలినయి మా కాడ

గట్టి మేలు మా సర్కారు కాడ లేదు సామీ!

పాడిపంటలు పొంగి పొర్లినయి

పండిన పంటను కొనే నాథుడు లేడు సామీ!

మా నరుల చెమట తడిసి పంట పండినా

ఈ దళారీలు మా కడుపు కొడ్తున్నరు సామీ!

ఈడ తిండే లేదంటే కండ యాడికెళ్ళి వస్తది!

కండ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద ఆసాములు సామీ!

మందగించక ముందుకు ఎళితే

ఆడ అన్నీ బొందలు బొక్కలే సామీ!

సొంత లాభం ఇప్పుడు మా హక్కు

పొరుగువాడు ఎట్లుంటడో మాకేం తెలుసు సామీ!

చెట్టపట్టాల్ పట్టుకునేది మేము కాదు

రౌడీలు రాజకీయ నాయకులు సామీ!

ఆళ్లే ఇప్పుడు ఈ దేశస్తులు

మరి మేము ఉట్టి మట్టి మనుషులం సామీ!

ఇయ్యాల మా జాతులు చెట్టుకొకటి పుట్టకొకటి

ఒకరి మతం ఇంకొకరికి అసయ్యం సామీ!

అసలు అన్నదమ్ములే కొట్లాడుకుంటున్నరు

ఇక జాతిమతాలు ఎట్ల కలిసుంటరు సామీ!

దేశమంటే మట్టే సామీ!

ఆ మట్టికి ఇయ్యాల మంచి గిరాకీ ఉంది సామీ!

అందుకే మాలాంటి చేతగానోళ్ళం ఇలాంటి వ్యవస్థ లో

మట్టి లో కలిసి వాల్యూ పెంచుతున్నం సామీ!

దేశాభిమానం రాజకీయ నాయకుల పేటెంట్

ఆళ్లవి గొప్పలే కానీ మాకు మేలు లేదు సామీ!

పుత్తడిబొమ్మ పూర్ణమ్మలు ఇయ్యాల

పురిటిలోనే చిత్తవుతున్నరు సామీ!

ఆ రోజు కన్యాశుల్కం వద్దన్నావ్

ఇప్పుడు జరిగే కన్యావిక్రయం

దిగొచ్చి ఆపుతావా సామీ!

రా!సామీ రా!మళ్ళీ పుట్టు!

మాలో అణిగి ఉన్న దేశాభిమానాన్ని

నీవు రాసిన గీతాన్ని నిజం చెయ్యి!

- డా. ప్యారక కృష్ణమాచారి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్